CBN: ఏడాది పాలనపై నేడు ప్రభుత్వం సమావేశం

ఏపీ కూటమి ప్రభుత్వం తమ ఏడాది పాలనను పురస్కరించుకుని "సుపరిపాలన.. తొలి అడుగు" పేరుతో నేడు అమరావతిలో సమావేశం నిర్వహించనుంది. వెలగపూడి సచివాలయం సమీపంలో జరగనున్న ఈ సభకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వం వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరవుతారు. ఈ సభ జూన్ 12న జరగాల్సి ఉండగా, అహ్మదాబాద్ విమానం ప్రమాదం కారణంగా బాయిదా పడింది. గత ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల పురోగతిని సమీక్షించడంతో పాటు రెండో ఏడాది పాలన లక్ష్యాలపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గత ఏడాది ప్రభుత్వ సాధనలను వివరిస్తూ.. రాష్ట్ర అభివృద్ధి కోసం రెండో ఏడాది రోడ్‌మ్యాప్‌ను ప్రకటించనున్నారు. ముఖ్యంగా అమరావతి రాజధాని పునర్నిర్మాణం, సింగపూర్ ప్రభుత్వంతో భాగస్వామ్యంతో స్టార్టప్ ఏరియా అభివృద్ధి, పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి కల్పన, సినీ పరిశ్రమ అభివృద్ధి, గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామ సభల బలోపేతం వంటి అంశాలపై దృష్టి సారించనున్నారు.
ఏడాది పాలనపై చర్చ
గత ఏడాది అమలు చేసిన అన్నా క్యాంటీన్లు, దీపం-2 పథకం కింద ఉచిత సిలిండర్లు, తల్లికి వందనం పథకం కింద రూ.15,000 ఆర్థిక సాయం, బీసీలకు ప్రత్యేక ప్రణాళికలు, విదేశీ విద్యకు రూ.15 లక్షల సాయం వంటి కార్యక్రమాల పురోగతిని సమీక్షిస్తారు. రెండో ఏడాది లక్ష్యాలలో రూ.1 లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన, పిఠాపురం నియోజకవర్గంలో రూ.308 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు, పంచాయతీ రాజ్ బలోపేతం, కాకినాడ పోర్టు అభివృద్ధి, రేషన్ మాఫియా నియంత్రణ వంటి అంశాలు ఉండవచ్చని సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com