CBN: జీఎస్టీ సంస్కరణలు ఓ గేమ్ ఛేంజర్:చంద్రబాబు

దేశంలో జీఎస్టీ సంస్కరణలు ఓ గేమ్ ఛేంజర్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. జీఎస్టీ 2.0 సంస్కరణలపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చర్చలో చంద్రబాబు పాల్గొన్నారు. గతంలో రాష్ట్రాలు కూడా రకరకాల పన్నులు కట్టేవన్న చంద్రబాబు.. జీఎస్టీ సంస్కరణలతో పేదలు జీవితాలు మారతాయని చెప్పారు. ఆర్థిక వ్యవస్థతకు జీఎస్టీ సంస్కరణలు ఊతమిస్తాయని చంద్రబాబు తెలిపారు. సంస్కరణలకు తాను ముందుంటానని చంద్రబాబు తెలిపారు. ‘‘జీఎస్టీ రెండోతరం సంస్కరణలు తీసుకొచ్చారు.. సంస్కరణలకు నేను ఎప్పుడూ ముందుంటాను. అభివృద్ధి జరిగితే సంపద సృష్టితో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ప్రభుత్వానికి ఆదాయం వస్తేనే సంక్షేమం, అభివృద్ధి జరుగుతుంది. సంపద సృష్టించని వారికి సంక్షేమం ఇచ్చే అధికారం లేదు. అప్పులు చేసి సంక్షేమం ఇవ్వడం సరికాదనేది నా నమ్మకం. ఆర్థిక ఇబ్బందులు వచ్చినా.. దేశం, రాష్ట్రమే ముఖ్యం. దీర్ఘకాల సంస్కరణలను దృష్టిలో పెట్టుకుని చూడాలి.” అని చంద్రబాబు అన్నారు.
అప్పులు చేసి సంక్షేమమా..?
అభివృద్ధికి కృషి చేస్తే అదే సంపద పెంచుతుందని చంద్రబాబు తెలిపారు. సంపద సృష్టించలేదని వ్యక్తులకు సంక్షేమం ఇచ్చే అర్హత లేదన్నారు. అప్పులు చేసి సంక్షేమం ఇవ్వడం సరికాదన్నారు. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో చాలా సంస్కరణలు జరుగుతున్నాయని చెప్పారు. వన్ నేషన్.. వన్ విజన్‌తో అడుగులు వేశామన్నారు.
గతంలో ఇలా...
గతంలో 5, 12, 18, 28 శాతం ఇలా 4 టైర్ పన్నుల వ్యవస్థ ఉండేదని చంద్రబాబు గుర్తు చేశారు. ఒకే ఉత్పత్తికి సంబంధించి అనుబంధ ఉత్పత్తులు వస్తే పన్నులు మార్చేవారని వెల్లడించారు. "పన్నుల విధానంలో 2 శ్లాబులు (5, 18శాతం) ఉంచి సరళతరం చేశారు. ఈసారి అన్ని పండుగలు ఘనంగా జరుపుకొనే అవకాశం ఉంది. ప్రధాని మోదీ సంస్కరణలతో పరోక్ష పన్ను చెల్లింపుదారులు 132శాతం పెరిగారు.” అని చంద్రబాబు వెల్లడించారు. 2017లో 65లక్షల మంది ఉంటే.. ప్రస్తుతం 1.51 కోట్ల మంది ఉన్నారు. జీఎస్టీ రిసిప్ట్‌ల ద్వారా 2018లో రూ.7.19లక్షల కోట్ల ఆదాయం వస్తే.. ప్రస్తుతం 22.08లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. జీఎస్టీ సంస్కరణలు పేదల జీవితాలపై ప్రభావం చూపుతాయి. ‘వన్ నేషన్- వన్ విజన్’ నినాదంతో ముందుకెళ్లాలి. డబుల్ ఇంజిన్ గ్రోత్ సాధించే దేశంగా భారత్ ఎదుగుతుంది. కొత్త పన్నులతో వినియోగం పెరిగి ఆర్థిక వ్యవస్థకు రూ.2లక్షల కోట్లు సమకూరుతుంది’’ అని సీఎం వివరించారు. వన్ నేషన్.. వన్ విజన్‌తో అడుగులు వేశామన్నారు. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా దేశం, రాష్ట్రమే తమకు ప్రధానమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసి ప్రపంచ పటంలో పెట్టాలన్నదే తన లక్ష్యమని ప్రకటించారు.
10 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈనెల 30వ తేదీ వరకు జరగనున్నాయి. 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడి అధ్యక్షతన జరిగిన శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com