CBN: నదుల అనుసంధానమే నా జీవిత ఆశయం

హంద్రీనీవాకు ఏపీ సీఎం చంద్రబాబు నీటిని విడుదల చేశారు. కృష్ణా జలాలు జలహారతి ఇచ్చి రెండు మోటార్లను ఆన్ చేశారు. "2019లో ఒక్క ఛాన్స్ అంటూ వచ్చారు.. వచ్చాక నరుకుడే నరుకుడు మొదలు పెట్టారు.. హంద్రీనీవాపై ఒక్క రూపాయి అయినా ఖర్చు చేశారా.. సినిమా సెట్టింగులు వేసి డ్రామాలు ఆడారని మండిపడ్డారు. ఇక, గట్టిగా కళ్లు మూసుకుంటే మూడేళ్లలో చంద్రబాబు ఎగిరిపోతాడు అని వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై కూడా సీఎం కౌంటర్ ఇచ్చారు. క్లైమోర్ మైన్సే నన్ను ఏం చేయలేదు.. జగన్ లాంటి వాళ్లు నన్ను ఏం చేయలేరు అని ధీమా వ్యక్తం చేశారు. తిట్లు, శాపనార్ధాలు నాకు తాకవు" అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.
6 లక్షల ఎకరాలకు సాగునీరు
‘‘రాయలసీమ కరవు, కష్టాలు, ప్రజల బాధలు నాకు తెలుసు. నేను ఇక్కడే పుట్టాను. ఇక్కడే పెరిగాను. అనంతపురంలో కరవు వస్తే గడ్డి తెచ్చి పశువులను కాపాడిన పార్టీ మాది. రాయదుర్గం ఎడారిగా మారకుండా చర్యలు తీసుకున్నాం. సీమ చరిత్రను తిరగరాయాలని ఎన్టీఆర్ తొలిసారి ఆలోచించారు. హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగుగంగకు శ్రీకారం చుట్టింది ఎన్టీఆరే. ఆయన ఆశయాలను టీడీపీ నెరవేర్చింది. రాయలసీమకు నీరిచ్చాకే చెన్నైకి నీళ్లు ఇస్తానని ఆనాడు ఎన్టీఆర్ చెప్పారు. హంద్రీనీవా నీరు 550 కి.మీ ప్రవహించి చిత్తూరు, కుప్పం వరకు వెళ్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. మల్యాల ద్వారా సుమారు 4 టీఎంసీల నీరు తీసుకెళ్లవచ్చు. కృష్ణగిరి, పత్తికొండ, జీడిపల్లి, పీఏబీఆర్, మారాల, గొల్లపల్లి, చెర్లోపల్లి, మదనపల్లె, చిత్తూరుకు నీరిచ్చే అవకాశం వస్తుంది. సమస్య ఎదురైతే సవాలుగా తీసుకొని పనిచేసే మనస్తత్వం నాది." అని చంద్రబాబు తెలిపారు.
రైతు కుటుంబాల్లో మార్పు కోసమే...
"వేరే రాష్ట్రానికి వెళ్తున్న కియాను అనంతపురం తీసుకొచ్చా. 8 నెలల్లో గొల్లపల్లి పూర్తి చేసి కియాకు నీళ్లిచ్చిన ఘనత మాది. రాయలసీమ రైతు కుటుంబాల్లో మార్పు రావాలనేదే నా లక్ష్యం. తొలి దశలో 1.98 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు వస్తుంది." అని సీఎం వెల్లడించారు. హంద్రీ-నీవా ప్రాజెక్టును రాయలసీమకు జీవనాడి అని.. నీళ్లు ఉంటే రాయలసీమను రత్నాల సీమగా చేయవచ్చన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టును ఎన్టీఆర్ చేపట్టారని.. అది ఆయన కల అన్నారు. తాను పూర్తి చేశానన్నారు. . ఈ ప్రాజెక్టు కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందించనుందన్నారు. రాయలసీమను కరువు నుండి విముక్తి చేసి, “రాళ్లసీమ”ను “రత్నాలసీమ”గా మారుస్తుందని వెల్లడించారు.
సర్వ నాశనం చేశారు
ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని నాశనం చేశారని చంద్రబాబు వైసీపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి పేరు రావాలని, ప్రజల జీవితాలు బాగుపడాలని నిత్యం కోరుకుంటానని తెలిపారు. "రాయలసీమకు రూ.2 వేల కోట్లు కూడా వైకాపా ఖర్చు చేయలేదు. హంద్రీనీవాకు కనీసం రూపాయి ఖర్చుపెట్టారా? అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసింది మా ప్రభుత్వమే. మా హయాంలోనే పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి, గండికోట వచ్చాయి. నదుల అనుసంధానం జరగాలనేది నా జీవిత ఆశయం. పోలవరం పూర్తి చేసి నదులు అనుసంధానిస్తే కరవు అనే మాటే ఉండదు. ఇప్పుడు రాయలసీమలోని అన్ని జలాశయాలు కళకళలాడుతున్నాయి. రాయలసీమను రతనాలసీమగా మారుస్తామనే ధైర్యం వచ్చింది. శ్రీశైలం నుంచి ఎస్ఆర్బీసీ, ముచ్చుమర్రి, మల్యాల కాల్వలు వస్తాయి. హంద్రీనీవా నుంచి అనంతపురం, పత్తికొండ, గొల్లపల్లికి మరో కాల్వ వెళ్తుంది. గాలేరు- నగరి నుంచి గండికోట, అవుకు, మైలవరానికి నీళ్లు వస్తాయి. శ్రీశైలం నుంచి ప్రారంభమైన నీరు తిరుపతికి వెళ్లే పరిస్థితి వస్తుంది." అని చంద్రబాబు అన్నారు. జగన్ లాంటి వాళ్లు శాపాలు ఇచ్చినా నాపై పని చేయన్నారు. జగన్ లాంటి వాళ్లు ఏం చేయగలరు? వారి శాపాలు నాపై పని చేయవు” అని వ్యాఖ్యానించారు. రాయలసీమ రైతుల జీవితాలను మెరుగుపరచడం తన సిద్ధాంతమని, ఈ ప్రాజెక్టు ద్వారా కరువు సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలన్నది తన లక్ష్యమని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com