CBN: పవన్ కల్యాణ్ ది గ్రేట్: చంద్రబాబు

కలెక్టర్ కాన్ఫరెన్స్ లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై సీఎం చంద్రబాబు పొగడ్తల వర్షం కురిపించారు. డిప్యూటీ సీఎం వేరే రంగం నుంచి వచ్చినా.. పరిపాలనలో చక్కటి పనితీరు కనబరుస్తున్నారని కనియాడారు.. 5,757 మందికి కానిస్టేబుళ్లుగా నియామక పత్రాలు ఇవ్వడం చాలా సంతోషమనిపించిందన్నారు. నియామకపత్రం తీసుకున్న ఓ కానిస్టేబుల్ తన ఊరికి రోడ్డు లేదని అడిగారు.. ఉప ముఖ్యమంత్రికి సమాచారం అందిస్తే.. తన శాఖకు సమాచారం పంపి అదే వేదిక నుంచి ఆ రోడ్డుకు రూ.3.90 కోట్లు మంజూరు చేయించారని గుర్తు చేశారు. తాజాగా అమరావతిలో ఏర్పాటు చేసిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. జిల్లాల కలెక్టర్ల సదస్సులో మొక్కుబడి చర్చలు కాకుండా అర్థవంతమైన సమీక్ష, చర్చలు జరగాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరైనా నిత్య విద్యార్థిగానే ఉండాలన్నారు. నిరంతరం వివిధ అంశాలను తెలుసుకుంటూ అభివృద్ధిలో భాగమవ్వాలని పిలుపునిచ్చారు. ప్రజా పాలనలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు వీలుగా ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నాం. జీఎస్డీపీ, కేపీఐ, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు కలెక్టర్ల సదస్సులో చర్చిస్తున్నామని తెలిపారు.
కలెక్టర్ల పాత్ర చాలా కీలకం
రాష్ట్ర అభివృద్ధిలో జిల్లా కలెక్టర్ల పాత్ర ఎంతో కీలకమని, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో వారు చూపుతున్న చొరవ అభినందనీయమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అమరావతిలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పాల్గొని కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని స్పష్టం చేశారు. గత కొంతకాలంగా సాధించిన ప్రగతిని వివరిస్తూ.. సుమారు 4 వేల కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారుల నిర్మాణాన్ని పూర్తి చేశామని వెల్లడించారు. అలాగే నీటి సంరక్షణలో భాగంగా లక్ష్యానికి అనుగుణంగా 1.20 లక్షల ఫాం పాండ్స్ (పంటకుంటలు) తవ్వడం జరిగిందని తెలిపారు. ఉపాధి హామీ పథకం (నరేగా) ద్వారా సుమారు 4,330 కోట్ల రూపాయలను వేతనాల రూపంలో నేరుగా లబ్ధిదారులకు చెల్లించామని అన్నారు. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఎంతో ఊతమిచ్చిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

