CBN: ఆగస్టు 15 నుంచి బస్సుల్లో జీరో టికెట్: సీఎం చంద్రబాబు

ఆగస్టు 15 నుంచి మహిళలకు బస్సుల్లో జీరో ఫేర్ టికెట్ ఇవ్వాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై సోమవారం సీఎం సమీక్ష నిర్వహించారు. మహిళలకు ఉచిత బస్సు పథకంతో ఏ రాష్ట్రాలకు ఎంత భారం అనే అంశంపై అధికారులతో చంద్రబాబు చర్చించారు. ఉచిత ప్రయాణంతో లబ్ధి, 100 శాతం రాయితీ వివరాలను మహిళలకు ఇచ్చే జీరో ఫేర్ టికెట్లో పొందుపర్చాలన్నారు. ‘‘ఈ పథకం ఆర్టీసీకి భారం కాకుండా ఆదాయ మార్గాలు అన్వేషించాలి. నిర్వహణ వ్యయం తగ్గింపుతో సంస్థను లాభాల బాట పట్టించాలి. లాభాల ఆర్జన విధానాలు, మార్గాలపై కార్యాచరణ రూపొందించాలి. రాష్ట్రంలో ఇకపై ఏసీ ఎలక్ట్రానిక్ బస్సులే కొనుగోలు చేయాలి. ఆర్టీసీ బస్సులను ఎలక్ట్రిక్‌గా మారిస్తే నిర్వహణ వ్యయం తగ్గుతుంది. ఇందుకు అవసరమయ్యే విద్యుత్‌ను సొంతంగా ఉత్పత్తి చేసుకోవాలి. ఆర్టీసీ డిపోల్లో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపై అధ్యయనం చేయాలి’’అని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.
ఎవరినైనా అరెస్టు చేస్తారు: హోంమంత్రి
ఆధారాలు ఉంటేనే ఎవరినైనా అరెస్టు చేస్తారని హోంమంత్రి అనిత అన్నారు. ఏమైనా ఉంటే కోర్టులో తేల్చుకోవాలని, కోర్టు రిమాండ్ విధించిందంటే మనం గౌరవించాలని పేర్కొన్నారు. న్యాయస్థానానికి సరైన ఆధారాలు ఇవ్వకుంటే రిమాండ్‌కు ఇవ్వరు కదా అన్నారు. ప్రొసీజర్ యథావిధిగా సాగుతుందని పేర్కొన్నారు. వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్టు, రిమాండ్ గురించి హోంమంత్రి అనిత ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మూడు సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లు పనిచేస్తున్నాయని చెప్పారు. జిల్లాకు ఒక సైబర్ క్రైమ్ పీఎస్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆదేశాలిచ్చారని తెలిపారు. లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ప్రతి నియోజకవర్గం, గ్రామంలో వీటి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రతి పోలీసుస్టేషన్‌కు రెండు డ్రోన్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి మూడు నెలలకోసారి జాబ్ మేళా నిర్వహిస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు యువతకు ఉద్యోగం, ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రతీ నియోజకవర్గంలో జాబ్ మేళాలు తప్పకుండా ఏర్పాటు చేస్తామన్నారు. ఒక్క మడకశిర మండలంలోనే ఇప్పటి వరకు 500 మందికి ఉపాధి కల్పించామని గుర్తు చేశారు. మడకశిరలో రూ.7 వేల కోట్లతో సోలార్ పార్క్ ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com