Polavaram: పోలవరంపై కేంద్రం ఫోకస్..

ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరంపై కేంద్రం ఫోకస్ పెట్టింది. పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్‌ను కొత్తగా పూర్తిస్థాయిలో నిర్మించాలని కేంద్రం కసరత్తు చేస్తోంది. 2020లో వచ్చిన భారీ వరదలకు డి-వాల్ కొంత దెబ్బతినింది. దాని సామర్థ్యం తేల్చేందుకు జాతీయ జలవిద్యుత్తు పరిశోధన కేంద్రం అధ్యయనం చేసింది. పరీక్షలు నిర్వహించి, పాత డి-వాల్ కొద్ది మేర మాత్రమే ధ్వంసమయిందని తేల్చింది. దెబ్బతిన్నంత మేర ఎక్కడికక్కడ చిన్నచిన్నగా ‘యు’ ఆకారంలో సమాంతర డయాఫ్రం వాల్ నిర్మించాలని సూచించింది. కొత్తగా నిర్మించే డి-వాల్ను ప్రస్తుత డయాఫ్రం వాల్‌తో అనుసంధానించాలని జాతీయ జలవిద్యుత్తు పరిశోధన కేంద్రం, పోలవరం డ్యాం డిజైన్ రివ్యూ ప్యానెల్ సంయుక్తంగా నిర్ణయించాయి.
పోలవరం ప్రాజెక్టుపై ఇటీవల ఢిల్లీలో జరిగిన రెండు సమావేశాల్లోనూ కేంద్రమంత్రి షెకావత్ డయాఫ్రం వాల్ అంశంపై చర్చించారు. పోలవరంలో గైడ్‌బండ్ కుంగడంపై సీరియస్ అయ్యారు. కొత్తగా పూర్తి స్థాయి డయాఫ్రం వాల్ నిర్మిస్తే చాలా ఖర్చవుతుందని, ఎక్కువ సమయం పడుతుందని అంటే ఆ కోణంలో ఆలోచించవద్దని కేంద్ర జల్‌శక్తి కార్యదర్శి సూచించారు. అన్నింటికన్నా డ్యాం భద్రతే ముఖ్యమని ఆ దిశగానే ఆలోచించి తుది నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆదివారం ఢిల్లీలో జరిగే సమావేశంలో పోలవరం డయాఫ్రం వాల్‌పై నిర్ణయం తీసుకోనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com