AP: మిర్చి రైతులకు కేంద్రం భారీ శుభవార్త..!

ఆంధ్రప్రదేశ్‌లో మిర్చి రైతుల సమస్యల పరిష్కారంపై కేంద్రం సానుకూలంగా స్పందించింది.ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు ఉంచిన మూడు డిమాండ్లకు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సానుకూలంగా స్పందించినట్లు కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు. ఎగుమతుల విషయంపై మాత్రం ఏపీలో ప్రత్యేక సదస్సు నిర్వహించి క్షేత్రస్థాయిలోని రైతులు, ఎగుమతిదారులు, ఇతర భాగస్వామ్యపక్షాల సలహాలు, సూచనలు తీసుకొని వాటిని అమల్లోకి తెస్తామని స్పష్టం చేసినట్లు వెల్లడించారు. కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, వ్యవసాయ శాఖ కార్యదర్శి దేవేష్ చతుర్వేది ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు, ఏపీ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
డిమాండ్లు ఇవే
మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద కొనుగోలు చేసి మార్కెట్ ధర- సాగు ఖర్చుకు మధ్య ఉన్న తేడాను.. కేంద్ర ప్రభుత్వమే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఎంఐఎస్ కింద సేకరించే సరకు గరిష్ఠ పరిమితిని 25% నుంచి 75% వరకు పెంచడం, మిర్చి సాగు వ్యయాన్ని ఐకార్ నిర్ణయించిన ధర ప్రకారం కాకుండా ఏపీ ప్రభుత్వం ఖరారు చేసిన రూ.11,600ని పరిగణనలోకి తీసుకోవడం, ఎగుమతులకు ఉన్న అడ్డంకులను తొలగించడంపైన ఈ భేటీలో చర్చించారు.
కేంద్రం చిత్తశుద్ధితో ఉంది
ఏపీలో మిర్చి రైతులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. మిర్చి ఎగుమతులు పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడినట్టు తెలిపారు. ప్రస్తుతం అన్ని పెట్టుబడులు కలుపుకొని మిర్చి రైతుకు క్వింటాకు రూ.11,600 ఖర్చు అవుతున్నట్టు ఏపీ ప్రభుత్వం తెలిపిందని.. అంతకు మించి సాయం చేసేందుకు కేంద్రం రెడీగా ఉందని తెలిపారు. దీంతో సాగు వ్యయాన్ని పెంచాలని ఐకార్ అధికారులకు శివరాజ్‌సింగ్ చౌహాన్ గట్టిగా చెప్పారు. ఇది చాలా సానుకూల పరిణామం. గతంలోలా ఎగుమతులు జరగకపోవడానికి భౌగోళిక, రాజకీయ అంశాలు కొన్ని ఉన్నాయి. అయినా ఎగుమతుల ప్రోత్సాహానికి ఏం చర్యలు తీసుకోవాలన్నదానిపై చర్చ జరిగింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com