AP: జగన్ పాలనపై భగ్గుమన్న కేంద్రమంత్రులు

వైసీపీ ప్రభుత్వ అసమర్థ విధానాలపై కేంద్రమంత్రుల విమర్శలు కొనసాగుతున్నాయి. కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ జగన్ సర్కార్‌పై విమర్శలు గుప్పించగా... తాజాగా మరో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఏపీని ఎంతో వెనక్కి తీసుకెళ్లిందని పీయూష్ గోయల్ విమర్శించారు. మద్యం, ఇసుక మాఫియాలతో రాష్ట్రాన్ని దోచుకున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన నిధులను వృథా చేశారని ఆరోపించారు. మోదీ ప్రభుత్వంలో అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశం మారబోతోందని చెప్పారు. ప్రతి నెలా దేశంలో ఉన్న పేదలందరికీ ఉచిత రేషన్ అందిస్తున్నామన్నారు.
జల్‌జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికీ తాగునీరు అందించే ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ముద్రా యోజన పథకం ద్వారా స్టార్టప్ కంపెనీలకు చేయూతనిస్తున్నట్లు పీయూష్ గోయల్ వివరించారు. ‘‘ఏపీలో కూటమి విజయం సాధించాలని కోరుకుంటున్నా. రాష్ట్రాభివృద్ధికి ఎన్నో సహజ వనరులున్నాయి. ఈ ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం అభివృద్ధిని పట్టించుకోలేదు. ఆ పార్టీ నాయకులు శాండ్, ల్యాండ్, లిక్కర్ మాఫియాలతో రూ.కోట్లు దోచుకున్నారు. ప్రధాని ఆవాస్ యోజన కింద 23 లక్షల ఇళ్లు ఏపీకి మోదీ కేటాయించారు. అందులో కేవలం 3.5 లక్షల ఇళ్లే జగన్ ప్రభుత్వం నిర్మాణం చేసింది. కేంద్రం ఇచ్చిన రూ.వేల కోట్ల నిధులను దారి మళ్లించారు. విశాఖ రైల్వే జోన్ ఇస్తామని విభజన చట్టంలో పెట్టారు. రైల్వే ప్రాజెక్టులకు అవసరమైన భూమిని జగన్ కేటాయించడం లేదు. ఎన్డీయే కూటమి విజయం సాధిస్తే విశాఖ రైల్వే జోన్ సాకారమవుతుంది. పంచాయతీలకు కేటాయించిన నిధులను వైకాపా ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు.
రాజ్‌నాథ్ తీవ్ర విమర్శలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై రక్షణమంత్రి రాజ్‌నాథ్ తీవ్ర విమర్శలు చేశారు. విశాఖలో మేధావులతో జరిగిన సమావేశంలో ఎన్డీయే కూటమి ఎంపీ అభ్యర్థి భరత్, ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజులతో కలిసి ఆయన పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కూడా జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం దురదృష్టకరమని రాజ్‌నాథ్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంటే ఇక్కడ అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం మాత్రం లెక్కకు మించి అప్పులు చేసిందని రాజ్‌నాథ్ సింగ్ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం మొత్తం రూ. 13.50లక్షల కోట్ల అప్పులు చేసి.. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తిపై రూ.2లక్షల రుణభారం మోపింది. ఖాజానా ఖాళీ చేసి పన్నుల భారం ప్రజల మీద వేసింది.
ఆంధ్రప్రదేశ్‌ను, విశాఖను డ్రగ్స్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌గా జగన్ ప్రభుత్వం మార్చిందని రాజ్‌నాథ్‌సింగ్ విమర్శించారు. ల్యాండ్, హ్యూమన్ ట్రాఫికింగ్, మైనింగ్ మాఫియాలు ఆంధ్రప్రదేశ్‌లో స్వైర విహారం చేస్తున్నాయి. జగన్ ప్రభుత్వం అవినీతి ఆరోపణలతో పూర్తిగా కూరుకుపోయిందని మండిపడ్డారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అభివృద్ధికి భరోసా కల్పిస్తుందన్నారు. కాంగ్రెస్ విస్మరించిన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు భారతరత్న ఇచ్చి తెలుగువారిపై ఉన్న గౌరవాన్ని ఎన్డీయే ప్రభుత్వం చాటి చెప్పింది. వచ్చే ఐదేళ్లలో దేశంలో జమిలి ఎన్నికలకు పూర్తిస్థాయిలో చర్యలు చేపడతామని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com