POLAVARAM: జగన్ ప్రభుత్వ తీరుపై కేంద్రం తీవ్ర ఆగ్రహం

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ వ్యవహరిస్తున్న తీరుపై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వద్దన్నా నీళ్లు నింపుతున్నారని, కాఫర్‌డ్యాం కొట్టుకుపోతే ఎవరు బాధ్యులని జగన్ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం నిలదీసింది. గైడ్‌బండ్ కుంగడానికి బాధ్యత ఎవరిదో ఎందుకు నిర్ధారించలేదని ప్రశ్నించింది. ఏపీ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టు విషయంలో ఏ మాత్రం సీరియస్‌నెస్ లేదని అర్థమవుతోందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. మరో 15 రోజుల్లో తిరిగి సమావేశం కావాలని, అప్పటికి నిర్దేశించిన అంశాల్లో కొన్ని పూర్తిచేసుకుని రావాలని ఆదేశించింది. ఢిల్లీలో మంగళవారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ అంశాలపై కేంద్ర జలశక్తిశాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ, కేంద్ర జలశక్తి మంత్రి సలహాదారు వెదిరే శ్రీరామ్ సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్‌బాబు తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశమంతా చాలా సీరియస్‌గా జరిగిందని తెలిసింది. అనేక అంశాల్లో ఏపీ అధికారుల తీరుతెన్నులపై దేబశ్రీ ముఖర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తిచేయాలన్నది ప్రస్తుత ప్రణాళిక అని ఆమె అడిగారు. 2024 జూన్ నాటికి పూర్తిచేయాలని తమ ఉద్దేశమని ఏపీ అధికారులు చెప్పారు. ఇది ఆచరణాత్మక ప్రణాళికేనా అని ఆమె సీరియస్ అయ్యారు. ఎన్నో అంశాలు పరిష్కారం కావలసి ఉండగా అప్పటికి ప్రాజెక్టు పూర్తిచేయగలమని ఎలా అనుకుంటున్నారని ప్రశ్నించారు. పోలవరంలో అంశాలపై ఆంధ్రప్రదేశ్ అధికారులకు ఎన్నిసార్లు లేఖ రాసినా స్పందన లేదని, కేంద్ర జలశక్తి తమను బాధ్యులను చేస్తోందని పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ శివానందన్ కుమార్ సమావేశంలో తెలిపారు. ప్రాజెక్టులో నీళ్లు ఖాళీచేయాలని తాము ఎన్నిసార్లు లేఖ రాసినా పట్టించుకోలేదని ఆయన తెలిపారు. దీంతో కేంద్ర కార్యదర్శి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎగువ కాఫర్‌డ్యాం తీవ్ర సీపేజీ సమస్యతో కొట్టుకుపోయేలా ఉందని, నీళ్లు నింపడం ఎంత ప్రమాదమో తెలుసా? అని దేబశ్రీ ప్రశ్నించారు. కాఫర్‌డ్యాం కొట్టుకుపోతే ఎవరు బాధ్యులని ఆమె నిలదీశారు. ఎగువ కాఫర్‌డ్యాం మరమ్మతులకు, నీటిని ఎత్తిపోస్తున్న ఖర్చుల్ని కేంద్రం చెల్లించబోదని తేల్చిచెప్పారు.
ప్రైమ్ ఆఫ్ వీర సాఫ్ట్‌వేర్ వినియోగించాలని రెండేళ్లుగా చెబుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని కేంద్ర కార్యదర్శి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సాఫ్ట్‌వేర్ అప్‌లోడ్ చేశామని, తేదీలు మాత్రమే అనుసంధానం చేయలేదని ఏపీ అధికారులు చెప్పారు. తేదీలతో అనుసంధానం చేయకపోతే ఆ సాఫ్ట్‌వేర్ వల్ల ప్రయోజనం ఏమిటని కేంద్ర అధికారి నిలదీశారు. దీనికి అధికారులు సమాధానం చెప్పలేకపోయారు. మరో 15 రోజుల్లో ఆ ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించారు. ఎగువ కాఫర్ డ్యాం సీపేజీ సమస్యపై అధ్యయనానికి తాము వెళ్లినప్పుడు అక్కడ అధికారులు గేలి చేస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నారని CSMRS డైరెక్టర్ కేంద్ర కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. దీంతో దేబశ్రీ మరింత ఆగ్రహానికి గురయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com