Chandra Babu Security : చంద్రబాబుకు భద్రత పెంపు..

Chandra Babu Security : టీడీపీ అధినేత చంద్రబాబుకు భద్రతను భారీ పెంచారు. ప్రస్తుతం చంద్రబాబుకు 6+6 ఎన్‌ఎస్‌జీ భద్రత కల్పిస్తున్నారు. ఈ భద్రతను రెట్టింపు చేస్తూ.. ఇకపై 12+12 ఎన్‌ఎస్‌జీతో భద్రత పెంచారు. ఈమధ్య చంద్రబాబు పర్యటనల్లో తరచూ ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ నేతలు ఘర్షణలకు కారణమవుతున్నారన్న అభియోగం ఉంది. వ్యక్తిగతంగా చంద్రబాబుకు హాని తలపెట్టే రీతిలో ఘర్షణలు జరుగుతున్నాయి. నిన్న చంద్రబాబు కుప్పం పర్యటనలోనూ భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడింది. చంద్రబాబు పర్యటించే సమయానికి కుప్పంలో అల్లర్లు, ఆందోళనలు, విధ్వంసం కొనసాగింది. చంద్రబాబు వెళ్లే చోటులో వైసీపీ నేతలు విధ్వంసానికి పాల్పడ్డారు. జడ్ ప్లస్ కేటగిరీ ఉన్న వీఐపీకి ఇవ్వాల్సినంత భద్రత రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం లేదన్న విమర్శలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి.
ఇప్పుడనే కాదు.. గతంలో చంద్రబాబు అమరావతికి వెళ్తున్న సమయంలోనూ బస్సుపై రాళ్లతో దాడి చేశారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ నేతలు దాడి చేసి, ఫర్నీచర్ ధ్వంసం చేసి విధ్వంసం సృష్టించారు. అంతేకాకుండా.. చంద్రబాబు బయటకు రాకుండా ఆయన ఇంటి గేట్లను తాళ్లతో కట్టారు. అప్పట్లో వైసీపీ నేతలు చేసిన ఈ పనులను సాక్షాత్తు డీజీపీనే సమర్ధించుకుంటూ వచ్చారు. కాని, ఈ సంఘటనలను ఎన్‌ఎస్‌జీ విభాగం చాలా సీరియస్‌గా తీసుకుంది. చంద్రబాబు భద్రతపై ఎన్‌ఎస్‌జీ ప్రత్యేక దృష్టి సారించింది. ఇకపై చంద్రబాబుకు అత్యంత పటిష్టంగా భద్రత కల్పించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే 12+12 ఎన్‌ఎస్‌జీతో భద్రత కల్పించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com