ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు విమర్శలు

జగన్‌ను మరోసారి నమ్మితే ఆస్తులపై రాష్ట్ర ప్రజలు ఆశలు వదులుకోవాల్సిందేనని. తెలుగుదేశం అధినేత చంద్రబాబు హెచ్చరించారు. కొత్త భూహక్కు చట్టంతో ప్రజల ఆస్తుల రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు...తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రెండో సంతకం ఈ చట్టం రద్దుపైనే పెడతామని హామీ ఇచ్చారు.అమరావతిపై కక్షగట్టి జగన్ నాశనం చేశారని లేకపోతే...గుంటూరు, విజయవాడ ప్రపంచస్థాయి నగరాలుగా అభివృద్ధిని చెంది ఉండేవని చంద్రబాబు అన్నారు. ప్రజాగళం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గుంటూరులో జరిగిన సభలో పాల్గొన్నారు. మూడురాజధానులు పేరిట వైకాపా మూడుముక్కలాట ఆడిందన్నారు. అమరావతిపై వారి అభిప్రాయం ఏంటో చెప్పి ఓట్లు అడగాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. గుంటూరులో ఐటీ టవర్స్ కట్టి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు... ప్రజల ఆస్తులన్నీ కొట్టేసేలా జగన్ దుష్టపన్నాగం పన్నారని చంద్రబాబు విమర్శించారు. ఇప్పటి వరకు బెదిరించే ఆస్తులు లాక్కున్నారని...కొత్త భూ హక్కు చట్టం ప్రకారం వారే వివరాలన్నీ తారుమారు చేసి తమ పేరిట రాసేసుకుంటారని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.గుంటూరు నగరంలో చంద్రబాబు రోడ్‌షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పెద్దఎత్తున హాజరైన కార్యకర్తలలో నగరంలోని వీధులన్నీ కిటకిటలాడిపోయాయి. అమరావతిని అభివృద్ధి చేసుకోవాలంటే మరోసారి తెలుగుదేశానికి పట్టం కట్టాలని గుంటూరు కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు.
పట్టాదారు పాసు పుస్తకంపై జగన్ బొమ్మ పెట్టారు. ప్రజలకు భూములు జగన్ తాత, నాన్న ఇచ్చారా? ఆస్తి మీదా? జగన్‌దా? ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు తీసుకువస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఆ చట్టం అమలైతే మీ భూములు మీవి కావు. భూములకు సంబంధించి నకలు పత్రాలు మీకు ఇస్తారు. భూమి రికార్డులు మార్చినందువల్ల చేనేత కార్మికుడి కుటుంబం విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. వైసీపీకి ఓటు వేస్తే మీ ఊరికి కూడా గొడ్డలి వస్తుంది. జాబు రావాలంటే బాబు రావాలి. గంజాయి కావాలంటే జగన్ ఉండాలని చంద్రబాబు తెలిపారు.
జగనన్న బాణం ఇప్పుడు రివర్స్ అయ్యిందన్న చంద్రబాబు, తండ్రి ఆస్తిలో చెల్లికి వాటా కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. అన్న, చెల్లి ఇంట్లో పోరాడుకోవాలి కానీ ఓట్లు చీల్చడం సరికాదని చంద్రబాబు పేర్కొన్నారు. దుర్మార్గుడికి ఓటు వేస్తే పాముకు పాలు పోసి పెంచినట్లే అవుతుందన్నారు. సీబీఐ అరెస్టు చేసే సమయంలో అధికారం ఉపయోగించి అడ్డుకున్నారు, ఈ ముగ్గురు మారీచులు కలిసి కడపను సర్వనాశనం చేస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. కొండలను అనకొండలు మింగేశాయని దుయ్యబట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com