CBN:గ్రీన్ ఎనర్జీ గ్రిడ్‌కు ₹4 లక్షల కోట్లు: సీఎం చంద్రబాబు

CBN:గ్రీన్ ఎనర్జీ గ్రిడ్‌కు ₹4 లక్షల కోట్లు: సీఎం చంద్రబాబు
X
94% స్ట్రైక్‌రేట్‌తో కూటమికి భారీ మాండేట్:సీఎం... వైకాపా హయాంలో విధ్వంసం: చంద్రబాబు

గత ఐదేళ్ల వైకాపా పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో తీవ్ర విధ్వంసానికి గురైందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశారు. రాష్ట్ర ఉనికిని కాపాడటానికే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు చేతులు కలిపాయని, ప్రజలు కూడా తమపై అచంచల విశ్వాసంతో 94 శాతం స్ట్రైక్ రేట్‌తో భారీ మాండేట్ ఇచ్చారని గుర్తుచేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్య విలువలు మంటగలిశాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. "ఎటువంటి నోటీసు ఇవ్వకుండానే నన్ను అరెస్ట్ చేశారు. అసెంబ్లీలో నన్ను అవమానిస్తే కన్నీళ్లు పెట్టుకున్నాను. కేవలం నేనే కాదు, గత ఐదేళ్లలో ఎందరో కన్నీరు మున్నీరయ్యారు" అని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు ఇప్పటికే తమ ప్రభుత్వం 7 శ్వేతపత్రాలను విడుదల చేసిందని, గత పాలకుల వైఫల్యాలను ప్రజల ముందు ఉంచామని తెలిపారు.

గ్రీన్ ఎనర్జీకి భారీ పెట్టుబడి

రాష్ట్రాన్ని ఇంధన రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తోందని చంద్రబాబు వెల్లడించారు. కేంద్రమంత్రి అమిత్ షాతో చర్చించిన అనంతరం, రూ. 4 లక్షల కోట్ల భారీ వ్యయంతో గ్రీన్ ఎనర్జీ కోసం ప్రత్యేక గ్రిడ్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. ప్రతి ఇల్లూ సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మారాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలులో ఎక్కడా రాజీ పడబోమని సీఎం స్పష్టం చేశారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏటా రూ. 34 వేల కోట్లను పింఛన్ల పంపిణీ కోసం కేటాయిస్తున్నాం. 'అన్నదాత సుఖీభవ' కింద రైతులకు ఏటా రూ. 20 వేలు అందిస్తున్నాం. ఇచ్ఛాపురం నుంచి చెన్నై వరకు రైల్వే లైన్లను నాలుగు వరుసలకు విస్తరిస్తున్నాం. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని కేంద్రం అండతో కాపాడుకుంటున్నామని, రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే తమ ప్రధాన ధ్యేయమని చంద్రబాబు పునరుద్ఘాటించారు.

Tags

Next Story