CM Chandrababu : మన నినాదం పీపుల్స్ ఫస్ట్

ఆంధ్రప్రదేశ్ లో విధ్వంసం జరిగాక దాన్ని పునరుద్ధరించేందుకు చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని కలెక్టర్లకు..ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రతి సంక్షోభంలో అవకాశాలను వెదుక్కోవడమే నాయకుల లక్షణమని చంద్రబాబు అన్నారు. బుధవారం సచివాలయంలో ప్రారంభమైన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి ప్రారంభోపన్యాసం చేశారు. జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఐటీ మంత్రి లోకేష్ అమెరికాకు వెళ్లి గూగుల్ సంస్థను ఏపీకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారని, దాని ఫలితమే విశాఖకు ఇప్పుడు ఆ సంస్థ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తోందని కలెక్టర్ల కాన్ఫరెన్స్ స్వాగతోపన్యాసంలో వివరించారు. ప్రజలతో గౌరవంగా ఉండాలని... వారు కూడా ప్రభుత్వంలో భాగస్వాములేనని కలెక్టర్లకు చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలకు మన పనులు నచ్చేలా చేయాలని చంద్రబాబు కలెక్టర్లను ఆదేశించారు. మానవత్వంతో ఆలోచించి పనిచేయాలని సూచించారు. కలెక్టర్ల సమర్థత వల్లే ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం మంచి పాలసీలు తీసుకొచ్చినా, వాటిని మీరే అమలుచేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
మన నినాదం పీపుల్స్ ఫస్ట్
కలెక్టర్లు కూడా ప్రజలకు సేవకులుగా ఉందామని... పీపుల్ ఫస్ట్ అనేది మన నినాదం కావాలని చంద్రబాబు స్పష్టం చేశారు. . రాష్ట్రంలో పరిస్థితి గాడిలో పడుతోందని... ఇప్పుడిప్పుడే చీకట్లు తొలగిపోతున్నాయన్నారు. గత ప్రభుత్వంలో ప్రజలు మాట్లాడటానికి భయపడేవారని... ఇప్పుడు స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు అన్నారు. బయట ప్రజలు నవ్వుతూ ఉన్నారంటే ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడినట్టేనని చంద్రబాబు వెల్లడించారు. ఈ నవ్వు కొనసాగేలా పాలన కొనసాగాలని చంద్రబాబు అన్నారు. విధ్వంసం తర్వాత జరిగే పునర్నిర్మాణానికి అందరూ కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. గత ప్రభుత్వంలో అధికారులకు కూడా ఒకటో తేదీన జీతాలు వచ్చేవి కాదని, ఈ ప్రభుత్వం వచ్చాక జీతాలు, పెన్షన్లు మొదటి తేదీనే ఇస్తున్నామన్నారు. గత ఐదేళ్లలో ఏపీ బ్రాండ్‌ను దెబ్బతీశారు. పక్క రాష్ట్రాలకు వెళ్తే ఏపీ గురించి అవహేళన చేసే పరిస్థితికి దిగజార్చారని... ఈ ఆరు నెలల్లో మళ్లీ పెట్టుబడులు వస్తున్నాయన్నారు.
స్మార్ట్ వర్క్ చేసేలా కార్యచరణ
రాష్ట్రాన్ని నాలెడ్జి ఎకానమీగా మార్చటం, స్మార్ట్ వర్క్ చేసేలా కార్యాచరణలు రూపోందించాల్సి ఉందన్నారు. ఆర్టీజీఎస్ ద్వారా పౌరసేవల్ని సులభంగా అందించేలా గూగుల్ తో ఒప్పందం చేసుకున్నామని చంద్రబాబు వివరించారు. మొదటి కలెక్టర్ల కాన్ఫరెన్సు సమయానికి రాష్ట్రం మరీ చీకట్లో ఉంది. ఇప్పుడు పరిస్థితి కొంత మారిందని, ప్రజలు స్వేచ్ఛగా అభిప్రాయాలను వ్యక్తీకరించే పరిస్థితిలో ఇప్పుడు ఉన్నారని, మార్పును నవ్వుతూ ఆహ్వానిస్తున్నారు. అదే సమయంలో హెచ్చరికలూ చేస్తూ అప్రమత్తం చేస్తున్నారన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com