Chandrababu: వైకాపా మునిగిపోయే నావ-చంద్ర బాబు

వివేకాను చంపి ఆయన కుమార్తె సునీతను కేసులతో వేధిస్తున్న ముఖ్యమంత్రి జగన్... అసలు మనిషేనా అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. నాలుగున్నరేళ్లుగా జగన్ అందరినీ ఏడిపించాడన్న బాబు ఇప్పుడు అతని వంతు వచ్చిందన్నారు.వైకాపా మునిగిపోయే నావ అని దాన్ని ఎవరూ కాపాడలేరని విమర్శించారు. కొత్త సంవత్సరంలో సైకో పాలన పోయి సైకిల్ పాలన వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
మూడో రోజు కుప్పంలో చంద్రబాబు పర్యటన కోలాహలంగా సాగింది. పీఈఎస్ వైద్య కళాశాల సమీపంలో కురుబ సామాజిక భవనం వద్ద కనకదాస విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అంగన్వాడీలు నిరసన దీక్ష శిబిరం వద్దకు వెళ్లి వారికి మద్దతు తెలిపారు. అనంతరం రోడ్డు షోలో పాల్గొన్నారు. బస్టాండ్ సమీపంలోని అన్న క్యాంటీన్ ను పరిశీలించారు. స్వయంగా ప్రజలకు భోజనం వడ్డించారు. తర్వాత కొత్తపేటలోని పెద్దపల్లి గంగమ్మ ఆలయంలో పూజలు చేశారు.
అనంతరం మల్లనూరు బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు.. వైకాపా సర్కారుపై నిప్పులు చెరిగారు. ప్రజల జీవితాలను జగన్ నాశనం చేశారని మండిపడ్డారు. సంక్షేమం పేరుతో అణగారిన వర్గాలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. వివేకాను హత్య చేసిన వారిని కాపాడుతూ వివేకా కుమార్తె సునీతను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ప్రకృతి వనరులను వైకాపా నేతలు కొల్లగొడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. కుప్పంలో గ్రానైట్ క్వారీలను మంత్రి పెద్దిరెడ్డి దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వారి భరతం పడతామని హెచ్చరించారు.
అధికారులు ఇంకా జగన్‌కు భయపడుతున్నారన్న చంద్రబాబు ..నీతిగా విధులు నిర్వహించాలని సూచించారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని గ్రహించిన కొంత మంది పోలీసులు ..తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
విద్యావ్యవస్థలో విప్లవం తెచ్చినట్లు జగన్ చెప్పుకుంటున్నారన్న చంద్రబాబు పాఠశాలలకు రంగులేస్తే విప్లవం వచ్చినట్టా అని చురకలంటించారు. వసతి గృహాల్లో పిల్లలకు సరిగ్గా తిండి పెట్టడం లేదని మండిపడ్డారు. కొత్త సంవత్సరంలో సైకో పాలన పోయి సైకిల్ పాలన వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com