వర్ల రామయ్యకు బెదిరింపు కాల్స్ రావడంపై చంద్రబాబు ఆగ్రహం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్యకు బెదిరింపు కాల్స్ రావడంపై పార్టీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. దీనిపై డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు లేఖ రాశారు. వర్ల రామయ్య రెండు దశాబ్దాలుగా ప్రజా సేవలో ఉన్నారని.. ప్రజా వ్యతిరేక కార్యకలాపాలపై గళం విప్పి ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నారని చంద్రబాబు తెలిపారు. రామయ్యను రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన గళం నొక్కేందుకు బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు.
ఏప్రిల్ 7 న వర్ల రామయ్య ఇంట్లో ఉండగా ఓ నంబర్ నుంచి పలుమార్లు కాల్స్ వచ్చాయని.. రామయ్య కోడలు ఫోన్ తీయగా అవతల వ్యక్తి.. వర్ల జగన్ మోహన్ రెడ్డిని విమర్శించడం మానుకోకపోతే రోజులు లెక్కపెట్టుకోవాలని బెదిరించారని చంద్రబాబు తన లేఖలో తెలిపారు. ఈ కాల్స్‌ను బట్టి చూస్తే వర్ల రామయ్యకు, ఆయన కుటుంబ సభ్యులకు ముప్పు పొంచి ఉందని... అందువల్ల రామయ్యకు, ఆయన కుటుంబానికి తగి భద్రత కల్పించాలని చంద్రబాబు.. డీజీపీని కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com