Chandra Babu: ఏపీలో అసలు ప్రజాస్వామ్యం ఉందా: చంద్రబాబు ఫైర్

Chandra Babu: ఏపీలో అసలు ప్రజాస్వామ్యం ఉందా: చంద్రబాబు ఫైర్
Chandra Babu:రాష్ట్రాన్ని సీఎం జగన్ అతలాకుతలం చేయాలనుకుంటున్నారని, ఖబడ్దార్‌ జగన్‌ రెడ్డి అంటూ హెచ్చరించారు టీడీపీ అధినేత చంద్రబాబు.

Chandra Babu: రాష్ట్రాన్ని సీఎం జగన్ అతలాకుతలం చేయాలనుకుంటున్నారని, ఖబడ్దార్‌ జగన్‌ రెడ్డి అంటూ హెచ్చరించారు టీడీపీ అధినేత చంద్రబాబు. మగాళ్లైతే, దమ్ము ధైర్యం ఉంటే.. ఇప్పుడు చూసుకుందాం రా అంటూ సీఎం జగన్‌, రామచంద్రారెడ్డి, డీజీపీకి సవాల్‌ విసిరారు. మిస్టర్‌ ఎస్పీ ఎక్కడున్నావ్‌ అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏపీలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. తనపైనే దాడి చేయడానికి ప్రయత్నించారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఓవైపు వైసీపీ కార్యకర్తలు దాడి చేస్తుంటే.. పోలీసుల కళ్లకు కనపడలేదా అని ప్రశ్నించారు.

టీడీపీపై వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా తిప్పికొడతామని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. జగన్‌కు పిచ్చి ముదురి పరాకాష్టకు చేరుకుందని విమర్శించారు. చంద్రబాబును దెబ్బతీయాలనే కుట్రతోనే కుప్పంలో అడ్డుకుంటున్నారని ఆరోపించారు. లా అండ్ ఆర్డర్ లేకుండా అల్లకల్లోలం సృష్టిస్తున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్లు వేస్తే ఒక రేటు.. దాడి చేస్తే మరో రేటు అంటూ వైసీపీకార్యకర్తనలు ఉసిగోల్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలానే చేస్తే జగన్ పాదయాత్ర చేసేవాడా అని నిలదీశారు.

కుప్పంలో అన్నా క్యాంటిన్‌ విధ్వంసంపై టీడీపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. విషయం తెలియగానే.. అన్న క్యాంటిన్‌కు చేరుకున్న చంద్రబాబు.. నడిరోడ్డుపై కూర్చుని ధర్నాకు దిగారు. ఓవైపు వైసీపీ నేతలు రెచ్చిపోతున్నా.. పోలీసులు ఎందుకని ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు

కుప్పంలో అన్న క్యాంటీన్‌ను రాజకీయ ప్రత్యర్థులు ధ్వంసం చేశారు. మరికాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు చేతుల మీదుగా కుప్పంలో అన్న క్యాంటీన్ ప్రారంభం కావాల్సి ఉంది. కుప్పం బస్టాండ్‌ జంక్షన్‌లోని ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఏర్పాటు చేసిన క్యాంటిన్‌ ద్వారా అన్నదాన కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించనున్నారు. కుప్పంలో రెండో రోజు పర్యటనలో భాగంగా అన్న క్యాంటిన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి చంద్రబాబు హాజరుకావాల్సి ఉంది. ఈలోగానే అన్న క్యాంటిన్‌ను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

కుప్పంలో వైసీపీ శ్రేణులు బలప్రదర్శనకు దిగారు. ఈలలు, కేకలు వేస్తూ.. ప్యాలెస్ రోడ్డులోని టీడీపీ బ్యానర్లు, కటౌట్లు ధ్వంసం చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. బస్టాండ్‌ నుంచి వైసీపీ కార్యకర్తలు ర్యాలీగా వస్తున్నప్పటికీ.. పోలీసులు అడ్డుకోలేదని టీడీపీ విమర్శిస్తోంది. దీంతో టీడీపీ కార్యకర్తలు కూడా ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌హౌస్ నుంచి ర్యాలీగా బయల్దేరారు.

టీడీపీ పేదవాళ్ల కడుపు నింపే కార్యక్రమం చేపడుతుంటే.. వైసీపీ నేతలు, కార్యకర్తలు మాత్రం పేదోళ్ల కడుపుకొట్టే పనులు చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. ప్రస్తుతం కుప్పంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇప్పటికే, ఆర్టీసీ బస్సులను డిపోలకే పరిమితం చేశారు. కుప్పంలో ఎలాంటి అల్లర్లు జరక్కుండా పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు కుప్పం రాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ.. అన్న క్యాంటీన్‌ను ధ్వంసం చేశారు. దీనిపై టీడీపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. టీడీపీ కార్యకర్తలను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story