- Home
- /
- ఆంధ్రప్రదేశ్
- /
- Chandrababu Kuppam Tour:...
Chandrababu Kuppam Tour: జగన్‌రెడ్డి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది: చంద్రబాబు

Chandrababu Kuppam Tour: టీడీపీ అధినేత చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా కుప్పంలో రోడ్‌షోలో పాల్గొన్న చంద్రబాబు.. వైసీపీ ప్రజా ప్రభుత్వం కాదని, దోపిడీ, దోచుకునే ప్రభుత్వమని ధ్వజమెత్తారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అరాచకాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ప్రజల భవిష్యత్ కోసమే తమ పోరాటమని, అక్రమ కేసులకు టీడీపీ నేతలు భయపడరని హెచ్చరించారు.
జగన్‌రెడ్డి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు మోసం చేసిందని చంద్రబాబు విమర్శించారు. ఏపీలో షాక్ కొట్టేలా కరెంట్ ఛార్జీలు పెంచారన్నారు. రైతులకు కనీస మద్దతు ధర, ఎరువులు ఇవ్వడం లేదని, పన్నులు పెంచుతూ ప్రజలపై భారం మోపుతున్నారని ఆరోపించారు. రెండేళ్లుగా ఉద్యోగాలు ఇవ్వని వైసీపీ ప్రభుత్వం.. ఇపుడు ఎయిడెడ్ స్కూల్స్ ఆస్తులపై కన్నేసిందని విమర్శించారు.
ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. అభివృద్ధి, బాబాయి మర్డర్, బూతు వ్యాఖ్యలపై సీఎం జగన్‌కు చంద్రబాబు సవాల్ విసిరారు. పులివెందులైనా, తిరుపతి అయినా.. ఎక్కడైనా చర్చకు సిద్ధమని చెప్పారు. రోడ్‌షోలో చంద్రబాబు మాట్లాడుతుండగా.. ఇంతలో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది.
గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు, కర్రలతో జనంలోకి దూసుకొచ్చారు. టీడీపీ కార్యకర్తలపై ఆగంతకులు రాళ్లు విసిరారు. దీంతో సభలో కలకలం రేగింది. సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మొదట నాటు బాంబులని అనుమానించిన టీడీపీ నేతలు, కార్యకర్తలు.. తర్వాత రాళ్లని తేల్చారు. చివరికి ఆగంతకులను టీడీపీ శ్రేణులు చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు.
కుప్పంలో వైసీపీ గుండాలు, రౌడీలు మొదటిసారి ప్రవేశించారని చంద్రబాబు మండిపడ్డారు. పోలీసులంటే వైసీపీ నాయకులకు భయం లేకుండా పోయిందని ఆరోపించారు. కొందరు అధికారులు, పోలీసులు వైసీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజల కోసం పనిచేసే పార్టీ టీడీపీ అని.. అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు చంద్రబాబు.
మొత్తానికి చంద్రబాబు కుప్పం పర్యటన మొదటిరోజు వాడీవేడీగా సాగింది. ప్రభుత్వ తీరు, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూనే.. వైసీపీ నేతల అరాచకాలను ప్రజలకు వివరించారు. ఏపీలో పరిణామాలపై మేధావులూ ఆలోచించాలని పిలుపునిచ్చారు. రెండురోజు పర్యటనలో భాగంగా శనివారం కుప్పం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com