CBN: పింఛన్లు ఇంటి వద్దే ఇచ్చేలా ఆదేశించండి

ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్‌దారులకు మే నెల పింఛను వారి ఇంటి వద్దే ఇచ్చే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు చంద్రబాబు రాసిన లేఖను టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఈసీకి అందజేశారు. పింఛన్ల పంపిణీకి ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఏర్పాట్లు చేసినట్లు కనిపించలేదని లేఖలో పేర్కొన్నారు. ఏప్రిల్ నెలలో ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను అడ్డుపెట్టుకొని పింఛన్ దారులను జగన్ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసిందన్నారు. పింఛను పంపిణీకి సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో దాదాపు 33 మంది వృద్ధులు ఎండవేడి తట్టుకోలేక మృతి చెందారని లేఖలో గుర్తు చేశారు. వైసీపీ దుర్మార్గపు ఆలోచనలతో, రాజకీయ ప్రయోజనాల కోసం వారి జీవితాలతో ఆడుకోవడం సరికాదని... జవహర్‌రెడ్డి.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉండి.. జగన్ రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చే విధంగా వ్యవహరిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.
మే నెల పింఛన్ పంపిణీకి ఇంకా ఐదు రోజులే సమయం ఉందని... గ్రామస్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నందును ఇంటింటికీ పింఛను పంపిణీని రెండు రోజుల్లో పూర్తిచేసే అవకాశం ఉందన్నారు. ఇంటి వద్దనే పింఛను పంపిణీ జరుగుతుందున్న సమాచారాన్ని లబ్ధిదారులకు చేరవేయాలని కోరారు. పింఛన్లు ఇవ్వకుండా ఈ అంశాన్ని ప్రతిపక్షాలపై నెట్టాలని జగన్ చూస్తున్నారని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. 62వేల మంది వాలంటీర్లతో రాజీనామా చేయించి.. ఇప్పుడు వారిని పోలింగ్ ఏజెంట్లుగా నియమించేందుకు వైసీపీ కుట్ర పన్నుతోందన్నారు. ఈసీకి ఉన్న అపరిమిత అధికారాలను ఉపయోగించి.. వాలంటీర్లుగా చేసిన వారు పోలింగ్ ఏజెంట్లుగా ఉండకుండా ఆదేశాలు ఇవ్వాలని ఈసీని కోరారు.
మరోవైపు ప్రజాగళం సభల్లో భాగంగా విజయనగరం జిల్లా నెల్లిమర్లలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పర్యటించారు. నెల్లిమర్ల జనసేన అభ్యర్థి మాధవి, స్థానిక లోక్‌సభ అభ్యర్థి తెలుగుదేశం నేత కలిశెట్టి అప్పలనాయుడిని గెలిపించాలని... ఇరువురు కోరారు. జగన్ ఉత్తరాంధ్ర ద్రోహిగా మిగిలారని..... చంద్రబాబు ఆరోపించారు. తాను తెచ్చిన ఒక్క పరిశ్రమ, ప్రాజెక్టు పేరును జగన్ చెప్పగలరా అని ప్రశ్నించారు. కూటమి సభలకు వస్తున్న స్పందన చూసి.. వైకాపా నేతల్లో....... ఆందోళన పెరుగుతోందన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, తారకరామతీర్థ సాగర్ పెండింగ్ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. భోగాపురం విమానాశ్రయాన్ని 2025 కల్లా పూర్తిచేస్తామన్న చంద్రబాబు నెల్లిమర్ల అతిపెద్ద ఇండస్ట్రియల్ హబ్‌గా తయారవుతుందన్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఏదో నాటకం ఆడటం జగన్‌కు అలవాటుగా మారిందని చంద్రబాబు దుయ్యబట్టారు. కరెంట్ బిల్లులు తగ్గాలంటే మే13 న ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సూచించారు. రాష్ట్రాన్ని అన్నిరకాలుగా దోపిడీ చేస్తున్న జగన్.. క్లాస్‌వార్ అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. నెల్లిమర్ల ప్రాంతంలో.... కిడ్నీ బాధితుల కోసం ప్రతి మండలానికి ఒక ఆసుపత్రి తీసుకొచ్చేందుకు...... కృషి చేస్తామని పవన్ హామీ ఇచ్చారు. ప్రజల కన్నీరు తుడవాలనేదే తమ ప్రయత్నమని పవన్ వివరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com