Chandrababu: విహారికి.. అండగా మేమున్నాం- చంద్రబాబు

Chandrababu: విహారికి.. అండగా మేమున్నాం- చంద్రబాబు
రెండు నెలల్లో మీకు రెడ్ కార్పెట్ పరుస్తామన్న నారా లోకేశ్

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌(ఏసీఏ)లో రాజకీయ కుట్రలకు బాధితుడ్ని అయ్యానని ఆరోపించిన టీమిండియా క్రికెటర్ హనుమ విహారికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మద్దతుగా నిలిచారు. విహారికి అండగా ఉంటామని, న్యాయం జరిగేలా చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.

రాష్ట్రంలో వైసీపీ రాజకీయ కక్షలకు, ప్రతీకార రాజకీయాలకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ లొంగిపోవడం సిగ్గుచేటని టీడీపీ అధినేత మండిపడ్డారు. క్రికెటర్ హనుమవిహారి విషయంపై మంగళవారం ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రతిభావంతుడైన క్రికెటర్ హనుమ విహారి.. ఏపీ తరఫున ఎప్పటికీ ఆడబోనని ప్రకటించేలా వేధించారని ఆరోపించారు. హనుమవిహారికి తాము అండగా ఉండి అతనికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. 'హనుమ విహారి ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఆట పట్ల అతనికున్న చిత్తశుద్ధిని వైసీపీ కుట్రా రాజకీయాలు నీరు గార్చలేవు. అన్యాయమైన చర్యలను ఏపీ ప్రజలు ప్రోత్సహించరు.' అని అన్నారు.

అటు, అధికార పార్టీ రాజకీయ జోక్యంతో ఆంధ్రా క్రికెట్ నుంచి హనుమ విహారి నిష్క్రమించడం ఆశ్చర్యం కలిగిస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. '2 నెలల్లో ఏపీ తరఫున తిరిగి ఆడడానికి హనుమ విహారి రావాలి. విహారి, అతని జట్టుకు రెడ్ కార్పెట్ తో స్వాగతం పలుకుతాం. ఆంధ్రా క్రికెట్ జట్టు రంజీ ట్రోఫీ గెలిచేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తాం.' అని లోకేశ్ ట్వీట్ చేశారు.

ఆంధ్ర క్రికెట్ లో రాజకీయ జోక్యం ఎక్కువయిందని... భవిష్యత్తులో ఏపీ తరపున ఆడబోనని హనుమ విహారి సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. రాజకీయ నేత కుమారుడి కోసం తనను కెప్టెన్సీ నుంచి తప్పించారని విహారి ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మాభిమానం దెబ్బతిన్న చోట తాను ఉండలేనని స్పష్టం చేశాడు.

Tags

Read MoreRead Less
Next Story