AP BANDH: ఏపీలో కొనసాగుతున్న బంద్

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిన బంద్ కొనసాగుతోంది. ఎక్కడికక్కడ తెలుగుదేశం శ్రేణులు రోడ్లపై బైఠాయించి వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నాయి. పలు చోట్ల బస్సులను అడ్డుకున్నారు. బంద్‌కు జనసేన, సీపీఐ, లోక్ సత్తా, MRPS సహా వివిధ వర్గాలు మద్దతు తెలిపాయి. జగన్ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాల్ని ఎండగడుతూ టీడీపీ శ్రేణులు బంద్‌లో పాల్గొంటున్నారు. బంద్ నేపథ్యంలో ఇవాళ పలు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి. ఆర్టీసీ బస్టాండ్లు, పలు కూడళ్లలో తెలుగు తమ్ముళ్లు ఆందోళనకు దిగారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌లకు తరలిస్తున్నారు. పోలీసుల తీరుపై తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు.
పల్నాడు జిల్లా నరసరావుపేటలో నియోజకవర్గ ఇన్ ఛార్జి చదలవాడ అరవిందబాబు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిరసన తెలిపారు. నిరసనలకు, ర్యాలీలకు అనుమతి లేదంటూ అరవిందబాబును పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు, గిద్దలూరులో డిపో వద్ద ఆర్టీసీ సర్వీసులను నిలిపేయాలని తెలుగుదేశం ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్లకు తరలించారు. తెలుగుదేశం కార్యకర్తలను కనిపించిన చోటే పోలీసులు అదుపులో తీసుకుని వాహనాలు ఎక్కించి పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. బస్సులను దగ్గరుండి బయటకు పంపిస్తున్నారు.
పాడేరులో బంద్ ప్రశాంతంగా సాగుతోంది. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు వాహనాలను అడ్డుకుంటున్న తెదేపా కార్యకర్తలను నిలువరిస్తున్నారు. బంద్ తో రహదారులపై వాహనాల రద్దీ తగ్గింది. YSR జిల్లా మైదుకూరులో తెదేపా నియోజకవర్గ ఇన్ ఛార్జి పుట్టా సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు మానవహారంగా ఏర్పడి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. పోలీసులు బలవంతంగా సుధాకర్ యాదవ్ ను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. కడపలో నిరసన తెలియజేస్తున్న తెదేపా శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో పోలీసులు రాష్ట్రవాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. శనివారమే ఈ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు, ఆంక్షలు విధించారు. డీజీపీ కార్యాలయం నుంచి జిల్లా ఎస్పీలు, నగర పోలీసు కమిషనర్లకు అందిన ఆదేశాల మేరకు ఎక్కడిక్కడ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ లు 144 సెక్షన్ విధిస్తూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని పేర్కొంటూ ఈ సెక్షన్ అమలు చేస్తున్నారు. తెదేపా శ్రేణులు, పౌరులు నిరసన తెలిపేందుకు బయటకు రాకుండా ఉండేలా ఇలా చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com