BABU: భద్రతపై అనుమానాలు ఉన్నాయ్: చంద్రబాబు

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు న్యాయస్థానం విధించిన జ్యుడిషియల్ రిమాండు గడువు ముగియడంతో రాజమండ్రి జైలు అధికారులు ఆయనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏసీబీ కోర్టు న్యాయాధికారి ముందు హాజరుపరిచారు. తన భద్రతపై అనుమానాలున్నాయని విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి ఎదుట టీడీపీ అధినేత అధినేత చంద్రబాబునాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తి వివరాలను రాసి సీల్డ్ కవర్లో జైలు అధికారులకు అందజేయాలని దాన్ని వారు కోర్టుకు పంపుతారని న్యాయాధికారి బాబుకు తెలిపారు. ఆరోగ్యం ఎలా ఉందని చంద్రబాబును న్యాయధికారి ప్రశ్నించారు. తనకు కొన్ని దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నాయని చంద్రబాబు బదులిచ్చారు. వైద్య నివేదికలను కోర్టుకు పంపుతున్నారని వాటిని తాను చూస్తున్నానని న్యాయాధికారి తెలిపారు. ఆ నివేదికలను మీకు అందజేస్తున్నారా అని ఆరా తీశారు. వైద్య నివేదికలను తనకు ఇస్తున్నారని చంద్రబాబు తెలిపారు. పరీక్షించిన వైద్యులు పక్కన ఉన్నారా అని న్యాయాధికారి ప్రశ్నించగా వారు ఆన్‌లైన్‌లోకి వచ్చి, గురువారం ఉదయం చంద్రబాబును పరీక్షించినట్లు తెలిపారు.
చంద్రబాబు వ్యాజ్యాలు సుప్రీంకోర్టు, హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని ఈ నేపథ్యంలో ఇంతకుమించి మాట్లాడలేనని న్యాయాధికారి ముగించబోతుండగా చంద్రబాబు తన విన్నపాన్ని వినాలని కోరారు. తాను జడ్ ప్లస్ భద్రత కలిగిన వ్యక్తినని, జైల్లో, బయట తన భద్రతపై అనుమానాలున్నాయన్నారు. ఆందోళన, సమస్యలపై పూర్తి వివరాలను సీల్డ్ కవర్లో జైలు అధికారులకు ఇవ్వాలని న్యాయాధికారి సూచించారు. ఆ కవర్ తమకు పంపాలని జైలు అధికారులను ఆదేశించారు. జ్యుడిషియల్ రిమాండును నవంబరు 1 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
చంద్రబాబును ఆన్‌లైన్ ద్వారా న్యాయాధికారి విచారిస్తున్న సమయంలో వైద్య నివేదికలను కోరితే జైలు అధికారులు ఇవ్వట్లేదని ఆయన తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ తెలిపారు. సీఐడీ తరఫు న్యాయవాదులకు అవి ఎలా వెళుతున్నాయన్నారు. సీఐడీ పీపీ దాఖలు చేసిన కౌంటర్‌లో 14వ తేదీనాటి వైద్య నివేదికను జతచేసినట్లు తెలిపారు. జైలు అధికారులు నివేదికను తనకే పంపుతున్నారన్నారని న్యాయాధికారి తెలిపారు. నివేదికలను కుటుంబసభ్యులకు ఇచ్చి వారినుంచి ఎక్నాలడ్జ్‌మెంట్ తీసుకోవాలని జైలు అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
కారాగారంలో చంద్రబాబును కలిసేందుకు ములాఖత్‌లను పెంచాలని ఆయన తరఫు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. న్యాయవాదులకు ఇచ్చే రోజుకు రెండు ములాఖత్‌లను జైలు అధికారులు ఒకటికి కుదించారన్నారు. ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులలో కేసులు విచారణ జరుగుతున్న నేపథ్యంలో రోజుకు మూడు ములాఖత్‌లు ఇప్పించాలని కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com