Chandrababu Naidu : కక్ష సాధింపు కోసమే స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుపై బురద : చంద్రబాబు

Chandrababu (tv5news.in)
Chandrababu naidu : ఓటీఎస్ వసూళ్లు పేదల మెడకు ఉరి తాళ్లుగా మారాయంటూ నిప్పులు చెరిగారు టీడీపీ అధినేత చంద్రబాబు. పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన ఆయన... ఓటీఎస్ వసూళ్లు... వైసీపీ అరాచకాలపై చర్చించారు. పేదలకు ఉచిత రిజిస్ట్రేషన్లు చేయాలని డిమాండ్ చేస్తూ... ఈనెల 20న మండల, మున్సిపల్ కార్యాలయాల వద్ద నిరసనలకు దిగాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు. అలాగే ఈనెల 23న అన్ని కలెక్టరేట్‌ల వద్ద ఆందోళన తెలపాలని నేతలకు సూచించారు. ఎన్టీఆర్ హయాంలో కట్టి ఇచ్చిన ఇళ్లకు... ఓటీఎస్ పేరుతో జగన్ రెడ్డి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలకు ఉచితంగా ఇళ్లు రిజిస్ట్రేషన్లు చేయించి ఇస్తామన్నారు.
ఇక కక్ష సాధింపు కోసమే స్కిల్ డెవలప్‌మెంట్‌పై జగన్ సర్కార్ బురద జల్లుతుందన్నారు. చెల్లింపులన్నీ ప్రేమ్ చంద్రారెడ్డి ఎండీగా ఉన్నప్పుడే జరిగాయని... ఆయన్ను సీఐడీ ఎందుకు ప్రశ్నించడంలేదని నిలదీశారు. సాక్షి సంతకం పెట్టినవారిపై అక్రమ కేసులు పెడతారా అంటూ నిప్పులు చెరిగారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు తెర లేపారని చంద్రబాబు ఆరోపించారు.
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేసేవారు కరువయ్యారన్నారు టీడీపీ అధినేత. గత్యంతరం లేక ప్రైవేట్ వ్యాపారులకు ధాన్యం అమ్ముతుండటంతో... బస్తాకు 500 రూపాయల వరకు రైతులు నష్టపోతున్నారన్నారు. ఇటు రోడ్డు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. అలాగే తిరుపతిలో జరిగే అమరావతి రైతుల మహాపాదయాత్ర ముగింపు సభకు టీడీపీ సంఘీభావం తెలుపుతుందని చంద్రబాబు తెలిపారు. సీఎం జగన్.... ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి చలి కాచుకుంటున్నారని మండిపడ్డారు. 2 లక్షల కోట్ల సంపద అయిన అమరావతిని నాశనం చేశారన్నారు. యువతకు ఉద్యోగ భరోసా కల్పించలేని దుస్థితిలో జగన్ సర్కార్ ఉందంటూ ధ్వజమెత్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com