చంద్రబాబు, నారాయణ పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ

చంద్రబాబు, నారాయణ పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ
చంద్రబాబు, నారాయణ కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఇవాళ వీటిపై విచారణ జరగనుంది.

అసైన్డ్ భూముల వ్యవహారంపై CID కేసు హైకోర్టుకు చేరింది. అసలు ఈ కేసులే అర్థరహితమని, వాటిని క్వాష్‌ చేయాలని కోరుతూ మాజీ సీఎం-టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఇవాళ వీటిపై విచారణ జరగనుంది. CID కేసులు కొట్టేస్తూ, అరెస్టు, తదుపరి చర్యల్లాంటివి నిలిపివేసేలా ఉత్తర్వులు ఇవ్వాలన్న ఈ పిటిషన్లపై వాదనలు మరికాసేపట్లో మొదలుకానున్నాయి. CIDని, మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేను ప్రతివాదులుగా చేరుస్తూ చంద్రబాబు, నారాయణ వేర్వేరుగా వేసిన పిటిషన్లలో పలు కీలకమైన అంశాల్ని ప్రస్తావించారు. FIRలో పేర్కొన్న సెక్షన్లు చంద్రబాబుకు వర్తించబోవని ఆయన తరపు అడ్వొకేట్లు కోర్టు దృష్టికి తెచ్చారు. జీవో 41 జారీ ఏ చట్టానికి, నిబంధనలకు వ్యతిరేకంగా లేదని వివరించారు. అసైన్డ్ రైతులకు లబ్ది చేకూర్చాలనే ఉద్దేశంతోనే 2016 ఫిబ్రవరి 17న జీవో 41 జారీ అయ్యిందని అడ్వొకేట్ పిటిషన్‌లో పేర్కొన్నారు.

అమరావతి ప్రాంతంలో రాజధాని ఏర్పాటుపై అప్పటి TDP ప్రభుత్వం 2014 సెప్టెంబర్‌ 1న కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగా భూసమీకరణ కోసం అవసరమైన చర్యలు చేపడుతూ వివిధ జీవోలు ఇచ్చారు. అదే ఏడాది CRDA ఏర్పాటు చేసిన తర్వాత.. ల్యాండ్‌ పూలింగ్‌ వేగవంతమైంది. ఐతే.. అసైన్డ్ భూములు తీసుకునే విషయంలో పలు అభ్యంతరాలు రావడంతో.. ఆయా భూములు సాగుచేసుకుంటున్న వారికి ఇబ్బంది లేకుండా చూసేందుకు 2016 ఫిబ్రవరి 17న జీవో 41 జారీ అయ్యింది. ఇదంతా నిబంధనల ప్రకారమే జరిగింది అనేది మాజీ సీఎం చంద్రబాబు వాదన. ప్రభుత్వం విధానపరమైన నిర్ణయంతో జీవో తెస్తే.. సీఎందే బాధ్యంటే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ ప్రేరేపిత కుట్రలో భాగంగానే ఇప్పుడు తప్పుడు కేసులు పెట్టారంటూ ఆయన వాదిస్తున్నారు. వీటిని కొట్టేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. CRDA చట్టంలోని సెక్షన్‌ 146 ప్రకారం ప్రభుత్వం లేదా అధారిటీ నిర్ణయాలపై ప్రాసిక్యూషన్‌ నిషేధమని ఆయన తరపున న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.

ల్యాండ్‌పూలింగ్ సమయంలో అసైన్డ్ భూముల హక్కుదారులకు ఎక్కడా అన్యాయం జరక్కూడదన్న ఉద్దేశంతోనే తాము వ్యవహరించామని మాజీ మంత్రి నారాయణ చెప్తున్నారు. ఈ వ్యవహారంలో బాధితులు ఫిర్యాదు చేయకుండా కేసులు, దర్యాప్తు, విచారణ అంటూ హడావుడి చేయడం రాజకీయంగా ఇబ్బందిపెట్టేందుకేనని TDP నేతలు చెప్తున్నారు. అసలు జీవో 41ను నేర పరిధిలోకి తీసుకురావడానికే వీల్లేదని వాదిస్తున్నారు. అలాగే పోలీసులు తమ FIRలో ఫలానా వ్యక్తికి లబ్ది చేకూర్చేందుకే ఇలా చేశారు అనడానికి కూడా ఎలాంటి వివరాలు పొందుపరచలేదని గుర్తు చేశారు.


Tags

Read MoreRead Less
Next Story