Chandrababu Naidu : పోలీసులు పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవు: చంద్రబాబు

పొట్లపాలెంలో టీడీపీ బలపర్చిన సర్పంచి అభ్యర్థి అదృశ్యంపై ఆరా తీసేందుకు వెళ్లిన మాజీమంత్రి కొల్లు రవీంద్రపై మరో కేసు పెట్టడం దుర్మార్గమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పోలీసు వ్యవస్థకు జగన్ పాలన మాయని మచ్చగా మారిందని ధ్వజమెత్తారు.
రాజకీయ ఒత్తిడికి తలొగ్గి పోలీసులు కేసులు పెట్టడం హేయమని విరుచుకుపడ్డారు. టీడీపీ బలపర్చిన అభ్యర్థిని వెతకడానికి వెళ్లిన రవీంద్రపై కేసు పెట్టడం దుర్మార్గం అని అన్నారు. నిజానిజాలు తొక్కిపెట్టి చట్టాన్ని నీరుగార్చి పోలీసులు కేసులు పెడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. పొట్లపాలెం సర్పంచి అభ్యర్థి అదృశ్యంపై పోలీసులు కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు.
అధికార పార్టీకి పోలీసులు దాసోహం అయ్యారనేందుకు తప్పుడు కేసులే నిదర్శనం అని ధ్వజమెత్తారు. బలహీనవర్గాలు బతకకూడదనేలా తప్పుడు కేసులు పెడుతున్నారని చంద్రబాబు అన్నారు. పోలీసులు పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com