Chandrababu Naidu : ప్రభుత్వ ఉద్యోగుల్ని సజ్జల బెదిరించారంటూ చంద్రబాబు ఆగ్రహం

Chandrababu (tv5news.in)

Chandrababu (tv5news.in)

Chandrababu Naidu : ప్రభుత్వ ఉద్యోగుల్ని సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బెదిరించారంటూ మండిపడ్డారు చంద్రబాబు.

Chandrababu Naidu : ప్రభుత్వ ఉద్యోగుల్ని సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బెదిరించారంటూ మండిపడ్డారు చంద్రబాబు. పార్టీ నేతలతో జరిగిన స్ట్రాటజీ మీటింగ్‌లో.. PRC విషయంపై చర్చించారు. ఉద్యోగులకు టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన రాయితీల్లో కోత విధించడం CM పెద్ద మనస్సుకు నిదర్శనమా? లేక అల్ప బుద్ధికి నిదర్శనమా? అని ప్రశ్నించారు. ఇప్పటికంటే ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉన్నా నాడు టీడీపీ పాలనలో 43% ఫిట్‌మెంట్‌ ఇచ్చామని గుర్తు చేశారు. కరోనా ప్రభావం ఉన్నా దేశంలో ఏ రాష్ట్రంలోను ఉద్యోగుల వేతనాల్లో కోతలు పెట్టలేదన్నారు. ప్రభుత్వ నిధుల్ని వైసీపీ నేతలే లూటీ చేశారంటూ మండిపడ్డారు చంద్రబాబు.

మద్యం కొనుగోళ్లలో సుమారు 6 వేల కోట్లు ప్రభుత్వానికి రావాల్సిన రాబడిని.. మద్యం కంపెనీలకు కట్టబెట్టి వేలకోట్లు దోచుకుంటున్నారని బాబు ఆరోపించారు. సెంటు పట్టా పేరుతో భూములను అధిక రేట్లకు కొని అక్కడ ఓ 7 వేల కోట్లు లూటీ చేశారన్నారు. ప్రభుత్వ ధనాన్ని లూటీ చేయడం వల్లే ఈ సమస్య వచ్చింది తప్ప కరోనా వల్ల ఆదయం తగ్గలేదని అన్నారు. లూటీ, దుబారా కట్టిపెట్టి ఉద్యోగుల, పించన్‌దారుల, కార్మికుల న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని వైసీపీ సర్కార్‌కు సూచించారు.

కరెంటు కోతలు, విద్యుత్‌ ఛార్జీల భారంపైనా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిస్కమ్‌లకు ప్రభుత్వ బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు. 32 నెలల పాలనలో 6 సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని ఎద్దేవా చేశారు. ఇప్పటికే ప్రజలపై 11 వేల 611 కోట్లు భారం మోపారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్‌ సంస్థల పేరుతో తెచ్చిన అప్పుల్లో 6 వేల కోట్లు దారి మళ్లించడం ఏంటని ప్రశ్నించారు. పెంచిన సిమెంటు ధరలు తగ్గించాలని, భారతి సిమెంటు ప్రయోజనాల కోసం భవన నిర్మాణ రంగాన్ని దెబ్బతీయొద్దని అన్నారు.

టీడీపీ పాలనలో నిర్మించిన టిడ్కో గృహాలను లబ్దిదారులకు స్వాధీనం చేయాలని డిమాండ్ చేశారు. టిడ్కో గృహాల పేరుతో తెచ్చిన 7,300 కోట్లు దారి మళ్లించారని, ఇప్పుడు లబ్ధిదారుల పేరుతో మరో 4వేల కోట్ల అప్పునకు సిద్ధం అవుతున్నారని విమర్శించారు. అటు, హైకోర్టులో తీర్పు రిజర్వులో ఉన్నప్పుడు రాజధాని భూములు తనఖా పెట్టడం చట్ట విరుద్ధం కాదా? అని ప్రశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story