CBN: కుర్చీని మడతబెట్టి... చంద్రబాబు మాస్‌ వార్నింగ్‌

CBN: కుర్చీని మడతబెట్టి... చంద్రబాబు మాస్‌ వార్నింగ్‌
మీరు చొక్కాలు మడతపెడితే మేం కుర్చీలు మడతబెడతాం... చంద్రబాబు మాస్‌ వార్నింగ్‌కు భారీ రెస్పాన్స్‌

అయిదేళ్ల వైసీపీ నరక పాలన నుంచి విముక్తి పొందడానికి తిరగబడతారో లేక బానిసలుగా మిగిలిపోతారో ప్రజలే తేల్చుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎన్నికలకు మరో 54 రోజులే సమయం ఉన్నందున.. తాను, పవన్‌ కల్యాణ్‌ తమ బాధ్యతగా పోరాడతామనీ .రాష్ట్ర భవిష్యత్తు ఆకాంక్షించే ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వామ్యం కావాలని కోరారు. ప్రజల జీవితాలు చిన్నాభిన్నం చేసిన జగన్‌కు ఎన్నికల్లో సమాధానం చెప్పి తీరుతామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తేల్చిచెప్పారు. విజయవాడలో జరిగిన విధ్వంసం పుస్తకావిష్కరణ సభలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు ఒకే వేదికను పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా పాలనలో సభలు కూడా నిర్వహించే పరిస్థితి లేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. విజయవాడలో జరిగిన విధ్వంసం పుస్తకావిష్కరణ సభలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు ఒకే వేదికను పంచుకున్నారు.

పవన్‌ కల్యాణ్‌ భీమవరం వెళ్తానంటే హెలికాప్టర్‌కు అనుమతి ఇవ్వలేదని తాను పర్చూరులో సభ పెట్టుకుంటే అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపై సీనియర్‌ జర్నలిస్టు ఆలపాటి సురేశ్‌ కుమార్‌ రాసిన ‘విధ్వంసం’పుస్తకాన్ని చంద్రబాబు ఆవిష్కరించి తొలి ప్రతిని పవన్ కల్యాణ్ కు అందచేశారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో జరిగిన విధ్వంసం సహా మొత్తం 185 అంశాల వివరాలతో పుస్తకాన్ని రూపొందించారు. ఐదేళ్ల నరకంపై రాసిన ‘‘విధ్వంసం’ పుస్తకం పై వచ్చే 54 రోజులూ ఇంటింటా చర్చ జరిగి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. 2లక్షల కోట్ల ఆదాయాన్నిచ్చే రాజధాని అమరావతిని విధ్వంసం చేసి..ఇప్పుడు నాలుగో రాజధాని హైదరాబాద్‌ అంటున్న వైకాపా నేతలకు సిగ్గూ లేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. చొక్కా మడత పెడతానంటూ జగన్‌ చేసిన వ్యాఖ్యలకు తాము కుర్చీలు మడతపెడతామంటూ మాస్‌ వార్నింగ్‌ ఇచ్చారు.

ప్రజాస్వామ్య విలువల్ని తాకట్టు పెట్టి విధ్వంసం తోనే వైకాపా పాలన ప్రారంభమైందని జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ విమర్శించారు. కూల్చివేతలతో మొదలైన ప్రభుత్వం కూలక తప్పదని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని తాను పదే పదే చెప్పే మాటలకు అక్షర రూపం విధ్వంసం పుస్తకమని చెప్పారు. భవిష్యత్తు లో పాలకులు ఎలా ఉండకూడదో విధ్వంసం పుస్తకం ఓ హెచ్చరిక అని తెలిపారు. రాష్ట్రంలో జరిగిన విధ్వంసాన్ని జరిగినట్లుగా నిష్పక్షపాతంగా పుస్తకం రూపొందిందన్నారు. వాలంటీర్ల వ్యవస్థను తాను ఎప్పుడూ తప్పు పెట్టలేదని జగన్ గ్రహించాలని హితవు పలికారు. కొంత మంది వాలంటీర్ల వల్ల వ్యవస్థకు చెడ్డపేరు వస్తోందని తాను అన్న మాటలకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు.

జగన్ కు ముఖ్యమంత్రి పదవి పోయాక విధ్వంసం పుస్తకం చదివితే...... తానెన్ని పాపాలు చేశాడో గ్రహిస్తాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. 5ఏళ్లలో ఇన్ని పాపాలు చేశానా అని జగనే ఆశ్చర్యపోతాడని ఎద్దేవా చేశారు. జగన్‌ అధికారాన్ని నిలుపుకోవడమే పరమావధిగా పాలన సాగిస్తున్నారని విధ్వంసం పుస్తకరచయిత ఆలపాటి సురేశ్‌కుమార్ ధ్వజమెత్తారు. జగన్ విధ్వంసకాండకు సందర్భాలు జోడించి పుస్తకంలో వివరించినట్లు చెప్పారు. విధ్వంసం పుస్తకావిష్కరణ సభకు విశాలాంధ్ర దినపత్రిక సంపాదకులు ఆర్‌వీ రామారావు అధ్యక్షత వహించారు. అమరావతి మహిళా రైతులకు విధ్వంసం పుస్తకాన్ని రచయిత అంకితమిచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story