ADR: దేశంలో ధనిక సీఎంగా చంద్రబాబు

ADR: దేశంలో ధనిక సీఎంగా చంద్రబాబు
X
చంద్రబాబు కుటుంబ ఆస్తులు రూ. 931 కోట్లు... మమతా బెనర్జీ ఆస్తులు రూ. 15 లక్షలు

దేశంలో ధనిక ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలిచారు. ఈ జాబితాలో పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ చివరి స్థానంలో నిలిచారు. అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ ఈ వివరాలను విడుదల చేసింది. దేశంలో సంపన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు అగ్రస్థానంలో నిలిచారు. ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబం ఆస్తుల విలువ రూ.931 కోట్లుండగా, అప్పులు రూ.10 కోట్లు ఉన్నాయి. రూ.15 లక్షల ఆస్తులతో వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చివరి స్థానంలో నిలిచారు. గత శాసనసభ ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్‌ వివరాల ప్రకారం.. అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ ఈ నివేదిక విడుదల చేసింది.

చంద్రబాబు ఆస్తులు రూ. 931 కోట్లు

చంద్రబాబు కుటుంబ ఆస్తులు రూ. 931 కోట్లతో ఏపీ సీఎం సంపన్న ముఖ్యమంత్రిగా నిలిచారు. చంద్రబాబు పేరిట రూ.36 కోట్ల ఆస్తులున్నాయి. ఆయన సతీమణి భువనేశ్వరి పేరిట రూ.895 కోట్ల ఆస్తి ఉన్నట్లు అఫిడవిట్‌లో చంద్రబాబు పేర్కొన్నారు. సంపన్న ముఖ్యమంత్రుల్లో అరుణాచల్‌ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ రెండో స్థానంలో ఉన్నారు. పెమా ఖండూ ఆస్తుల విలువ రూ.332 కోట్లు కాగా, ఆయనకు భారీ స్థాయిలో రూ.180 కోట్ల అప్పులున్నాయి. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రూ.51 కోట్ల ఆస్తులతో మూడో స్థానంలో నిలిచారు. సిద్ధరామయ్యకు రూ.23 కోట్ల అప్పులున్నాయి. 30 కోట్ల ఆస్తులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 7వ స్థానంలో నిలిచారు. ఆయన ఆదాయం రూ.13 లక్షలు కాగా, అప్పులు 1.3 కోట్లు ఉన్నాయి.

అట్టడుగున మమతా బెనర్జీ

రూ.15 లక్షల ఆస్తులతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ దేశంలో పేద సీఎంగా నిలిచారు. జమ్మూ కశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా రూ.55 లక్షల ఆస్తులతో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచారు. కేరళ సీఎం పినరయి విజయన్‌ రూ.1.18 కోట్ల ఆస్తులతో చివరి నుంచి మూడో స్థానంలో నిలిచారు. దేశంలో ముఖ్యమంత్రుల సరాసరి ఆస్తి విలువ రూ.52.59 కోట్లుగా ఉందని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ పేర్కొంది. ఓవరాల్‌గా 31 మంది సీఎంల మొత్తం ఆస్తి రూ.1,630 కోట్లు ఉంది. మొత్తం సీఎంల ఏడాది సగటు ఆదాయం రూ.13,64,310గా ఉంది. 31 మంది ముఖ్యమంత్రుల్లో ఇద్దరు మాత్రమే బిలియనర్లుగా ఉన్నారు.

Tags

Next Story