CBN: ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చే కుట్ర

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చాలని తల్లి, పిల్ల కాంగ్రెస్ నాటకాలు ఆడుతున్నాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. NDAకు పడే ఓట్లు చీల్చి మళ్లీ జగన్ ను అధికారంలోకి తీసుకు రావాలనుకుంటున్నారని తెలిపారు. ఆడపిల్లలకు అన్యాయం జరిగితే ఇంట్లో తేల్చుకోవాలని సూచించారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తామని 4వేల రూపాయలు పెరిగే పింఛన్లను ఏప్రిల్ నుంచే ఇస్తామని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా పెద్దకూరపాడు నియోజకవర్గం క్రోసూరులో ప్రజాగళం సభలో పాల్గొన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఏపీలో రావణాసురుడిని అంతం చేసేందుకే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి కూటమి కట్టాయని అన్నారు. జగన్ ఆయన ఎమ్మెల్యేలు ఏపీని హోల్‌సేల్‌గా దోపిడీ చేశారని ఆరోపించారు. ఇసుక మాఫియా ద్వారా 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టారని ఆరోపించారు. NDA అధికారంలోకి వచ్చాక ఇసుక ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. ముస్లింల 4 శాతం రిజర్వేషన్లు కొనసాగిస్తామన్నారు. వంద రోజుల్లో ఏపీ నుంచి గంజాయి, డ్రగ్స్, జె-బ్రాండ్ మద్యాన్ని నిర్మూలిస్తామన్నారు. ఈ ఎన్నికలకు జగన్ శవ రాజకీయాలతో వస్తున్నారని ధ్వజమెత్తారు.
ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చాలని.. తల్లి, పిల్ల కాంగ్రెస్ కొత్త కుట్రకు తెరలేపాయని చంద్రబాబు ఆరోపించారు. కుటుంబంలో తేల్చుకోవాల్సిన వివేకా హత్యోదంతాన్ని ప్రజల నెత్తిన ఎందుకు రుద్దుతున్నారని ప్రశ్నించారు. జాబు కావాలంటే NDA మళ్లీ రావాలన్న చంద్రబాబు, తెలుగుదేశం అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు. పెదకూరపాడులో ఐటీ పార్కు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
‘రాముడు దేవుడైనప్పటికీ.. వానరులతో కలిసి పోరాడారు. రాష్ట్రంలో రావణాసురుడిని అంతం చేసేందుకే భాజపాతో కలిశాం. ఈ దోపిడీ దొంగలు కృష్ణా నది మీదనే రోడ్డు వేశారు. ఇసుకాసురుడిని అంతం చేసి పేదలకు ఉచితంగా ఇసుక ఇస్తాం. ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో అనేక అరాచకాలు జరిగాయి. ముస్లింలపై అనేక దాడులు జరిగాయి. ముస్లిం మహిళలు, బాలికలను వైకాపా నేతలు వేధించారు. ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు అలాగే ఉంటాయని హామీ ఇస్తున్నా. 2014లోనూ భాజపాతో తెదేపా కలిసే ఉంది. 2014-2019 మధ్య ముస్లింలకు ఏమైనా అన్యాయం జరిగిందా? రాష్ట్రంలో ముస్లింల రక్షణకు నేను హామీ ఇస్తున్నా. జాబు కావాలంటే చంద్రబాబు మళ్లీ రావాలి. గంజాయి కావాలంటే జగన్ ఉండాలి. ఏపీ నుంచి ఎంతోమంది అమెరికాకు వెళ్లారు. తెలుగువాళ్లు అమెరికా వెళ్లేలా ఫౌండేషన్ వేసింది ఎవరు? పోలవరం ప్రాజెక్టును నేనే 72 శాతం పూర్తి చేశాను. ఈ ఐదేళ్లలో పోలవరం మిగతా పనులు ఏమాత్రం చేయలేదు. యువత కంటే నా ఆలోచనలు 20 ఏళ్లు ముందుంటాయి. ఆనాడు నేను చేసిన కృషితో ఇవాళ హైదరాబాద్ నంబర్ వన్‌గా ఉంది. తెదేపా అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తా. తెదేపా గెలిస్తే.. పెదకూరపాడులో ఐటీపార్కు ఏర్పాటుచేస్తా’’ అని చంద్రబాబు అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com