Chandrababu : టీడీపీ నేతలకు చంద్రబాబు క్లాస్.. పనిచేసే వాళ్లకే పదవులు..

Chandrababu : టీడీపీ నేతలకు చంద్రబాబు క్లాస్.. పనిచేసే వాళ్లకే పదవులు..
Chandrababu : మంగళగిరిలోని పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో టీడీపీ నేతలపై చంద్రబాబు సీరియస్‌ అయ్యారు

Chandrababu : మంగళగిరిలోని పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో టీడీపీ నేతలపై చంద్రబాబు సీరియస్‌ అయ్యారు. టీడీపీ బలోపేతానికి తాను చేస్తున్న ప్రణాళికలను వివరిస్తూనే పనితీరు మెరుగుపరుచుకోని కొందరు నేతలకు ఏకంగా గట్టి క్లాస్‌ తీసుకున్నారు. పనితీరు మెరుగుపడని కొందరు నేతల విషయంలో తాను నిర్ణయాలు తీసుకునే సమయం వచ్చిందని డైరెక్టుగా హెచ్చరించారు.

పార్టీ కార్యకర్తలు చేస్తున్న పోరాటాలను గుర్తు చేసిన చంద్రబాబు.. కొందరు నేతలు ఇంకా తమ పని తాము చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మీకు ఇన్‌ఛార్జ్‌ హోదా ఇచ్చినప్పుడు ఎందుకు కార్యక్రమాలు చేయడం లేదని నిలదీశారు. మూడున్నరేళ్లు అయింది.. నేతలు యాక్టివ్‌ అవుతారని ఇక ఎదురు చూసేది లేదని సమావేశంలో తేల్చి చెప్పారు చంద్రబాబు.

ఇటు యువతకు ఇచ్చే టికెట్లపైనా చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. గతంలో ప్రకటించినట్లు 40 శాతం సీట్లు యువతకు కేటాయిస్తామని.. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. పనిచేసే వాళ్లకే పదవులు ఇచ్చేలా మెకానిజం తీసుకొస్తున్నామని తెలిపారు. ఇక అక్రమ అరెస్టుల పట్ల కొందరు నేతల తీరుపైనా చంద్రబాబు సీరియస్ అయ్యారు. పోలీసులు ఇంటికొస్తే నేతలు గట్టిగా నిలదీయాలని సూచించారు. కార్యకర్తలు అక్రమ కేసుల్లో జైలుకు వెళితే నేతలు గట్టిగా స్పందించాలని, వారికి అండగా నిలబడాలని నేతలకు సూచించారు.

ప్రతి నియోజకవర్గంలో న్యాయవాదిని పెట్టుకోవాలని.. న్యాయపోరాటం చేసి కార్యకర్తలను కాపాడుకోవాలన్నారు. పోస్టింగ్‌ల కోసం కక్కుర్తిపడి ఇష్టానుసారం ప్రవర్తిస్తున్న కొందరు పోలీసులను న్యాయస్థానంలో దోషులుగా నిలబెడతామని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు రెచ్చిపోయేవారంతా జగన్‌రెడ్డికి కూడా దొరక్కుండా పారిపోతారని చంద్రబాబు తేల్చిచెప్పారు.

ఇక ఏపీలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపైనా చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తల్ని కొట్టిన పోలీసులకు అదే చివరి రోజు కావాలన్నారు. న్యాయం జరగడానికి సమయం పట్టొచ్చు కానీ.. తప్పు చేసిన పోలీసుల్ని శిక్షించకుండా వదిలేది లేదు ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. మరోవైపు అక్రమాలు, అన్యాయాలు చేసే వైసీపీ నేతలకు రిటర్న్ గిఫ్ట్‌లు సిద్ధం చేస్తున్నామని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. దేశాలు దాటేందుకు ఇప్పుడే వీసాలు రెడీ చేసుకోవాలని ఎద్దేవా చేశారు.

మొత్తానికి రానున్న ఎన్నికలు, టీడీపీని బలోపేతం చేయడంతో పాటు నేతలకు క్లాస్ తీసుకుంటూ వారిని మరింత యాక్టివ్ చేస్తున్నారు చంద్రబాబు. మరి.. టీడీపీ అధినేత వార్నింగ్‌తో పార్టీ నేతల పనితీరు ఇక ముందు ఏవిధంగా ఉంటుందో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story