Chandrababu Naidu : జీఎస్డీపీ, తలసరి ఆదాయం రెట్టింపు అయ్యేలా చర్యలు : చంద్రబాబు.

Chandrababu Naidu : జీఎస్డీపీ, తలసరి ఆదాయం రెట్టింపు అయ్యేలా చర్యలు : చంద్రబాబు.
X

ప్రతి ఐదేళ్లకు ఒకసారి జిఎస్ డిపి, తలసరి ఆదాయం రెట్టింపు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శులతో జిఎస్ డిపి, తలసరి ఆదాయం మీద సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. తలసరి ఆదాయం ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతుందని.. కాబట్టి దాన్ని పెంచే విధంగా చర్యలు ఉండాలన్నారు. కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్ల విషయంలో జాగ్రత్తగా అంచనాలు వేయాలని, క్షేత్రస్థాయి నుంచి తీసుకునే సమాచారం ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలని చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. బంగారు మిత్రల ద్వారా ఆయా పేద కుటుంబాలను ఆదుకునేలా చర్యలు చర్యలు ఉండాలని సూచించారు. గత వైసిపి పాలకులు చేసిన మితిమీరిన అప్పుల వల్ల ఏపీ ఆర్థిక వ్యవస్థ కుంటుపడిందని చెప్పారు.

వాళ్లు చేసిన అప్పులకు గాను ఇప్పటికీ 14% వడ్డీ చెల్లిస్తున్నామని.. వడ్డీలు తగ్గించుకునేందుకు క్రెడిట్ రేటింగ్ పెంచుకొని రుణాల రీ షెడ్యూల్ చేస్తున్నట్టు సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు. 2019 నుంచి 24 మధ్య ఆర్థిక క్రమశిక్షణ పూర్తిగా దెబ్బతీశారని.. దానివల్ల అనేకమందిపై ఎఫెక్ట్ పడిందని చెప్పారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీకున జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చిందన్నారు. బ్యాంకర్లు ఎవరూ చారిటీ కోసం రుణాలు ఇవ్వరని.. కానీ ఒక్కో దాన్ని గాడిన పెడుతూ ఇప్పుడు ఆర్థిక వృద్ధిని పెంచుతున్నట్టు సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు. ప్రస్తుతం జీతాల చెల్లింపును కూడా గాడిలో పెట్టామని.. రాష్ట్రవ్యాప్తంగా సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని చెప్పారు.

నెల్లూరు జిల్లాలో లంబసింగి కుంకుమ పువ్వు ఉత్పత్తి అయితే దేశవ్యాప్తంగా న్యూస్ అవుతుందని.. ఇంకోవైపు ఏలూరు దగ్గర కోకో సిటీ కూడా ఏర్పాటు అవుతున్నట్టు తెలిపారు. కాఫీ సాగు పెంచడంతోపాటు అరకు కాఫీ బ్రాండ్ కూడా ప్రమోట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

Tags

Next Story