విపత్కర పరిస్థితుల్లోనే నాయకత్వ సామర్థ్యం బయటపడుతుంది : చంద్రబాబు
Nara chandrababu Naidu (File Photo)
కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ధిష్ట ప్రణాళికతో పని చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సూచించారు. కొవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజా ప్రతినిధులు ప్రజలకు అండగా నిలబడటంతో పాటు సరైన మార్గదర్శకత్వం అందించాలని చెప్పారు. కొవిడ్ వ్యాప్తి- ప్రజాప్రతినిధుల బాధ్యత అంశంపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో వర్చువల్ పద్ధతిలో నిర్వహించిన సదస్సులో పాల్గొన్న చంద్రబాబు.... ప్రజలందరికీ టీకా అందించాలని చెప్పారు. కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని సూచించారు.
ఏపీలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని చంద్రబాబు అన్నారు. కరోనా నిబంధనలు అమలు చేయడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. దేశంలో అత్యధిక కేసులు ఏపీలోనే నమోదవుతున్నాయని చెప్పారు. విపత్కర పరిస్థితుల్లోనే నాయకత్వ సామర్థ్యం బయటపడుతుందని అన్నారు. వైద్య రంగంలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు దృష్టి సారించాలని చెప్పారు. పారామెడికల్ సిబ్బంది విధులు యుద్ధప్రాతిపదికన నిర్వర్తించేందుకు అడ్డంకులు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com