SC: చంద్రబాబు కేసులో సుప్రీంలో కీలక వాదనలు

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ఇవాళ్టికి వాయిదా వేసింది. చంద్రబాబు తరఫున వాదించిన హరీష్ సాల్వే నిన్న( సోమవారం) ఉదయం నుంచి సాయంత్రం వరకు సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. ముఖ్యంగా 17-A నిబంధినపైనే వాదనలు జరిగాయి. సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ నేడు వాదనలు వినిపించనున్నారు. ఈ కేసులో సెప్టెంబర్ 19న వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసిందని మరుసటి రోజున సీఐడీ కొన్ని డాక్యుమెంట్లను కోర్టు ముందుంచిందని హరీష్ సాల్వే సుప్రీంకోర్టుకు వివరించారు. 2018లో నేరం జరిగిందన్న వివరాలేవీ సీఐడీ రిమాండ్ రిపోర్టులో లేవన్నారు. 2021లో నమోదు చేసిన FIR ఆధారంగానే రిమాండ్ రిపోర్టు ఉందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈ రిపోర్టు ఆధారంగా 17-A వర్తిస్తుందన్నదే తాము చెప్పదలచుకున్నామని కోర్టుకు స్పష్టం చేశారు
స్కిల్ కేసుకు సంబంధించి 2018లోనే విచారణ ప్రారంభమైందన్న సీఐడీ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలను న్యాయమూర్తి జస్టిస్ త్రివేది ప్రస్తావించారు. రోహత్గీ వాదనే సహేతుకం కాదని FIRకు దారి తీసిన విచారణ అది కాదని హరీష్ సాల్వే సమాధానమిచ్చారు. గతంలో ఏదో విచారణ జరిగిందని దానిని మూసేసి కొత్తగా విచారణ ప్రారంభించారని సాల్వే తెలిపారు. ఈ క్రమంలో జస్టిస్ త్రివేది కలగజేసుకుని ఆ డాక్యుమెంట్లు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. వాటిని హైకోర్టు పరిశీలించిందా అని అడిగారు. అసలు సమస్య అక్కడే ప్రారంభమైందని సాల్వే బదులిచ్చారు. 2018కి సంబంధించిన ఏ డాక్యుమెంట్లనూ ప్రస్తావించలేదన్నారు. పత్రాలేవీ సమర్పించకపోయినా కోర్టు 2018కి ముందు నేరం జరిగినట్లు రికార్డు చేసిందని సాల్వే వివరించారు. రిమాండ్ ఆర్డర్‌నే ఛాలెంజ్ చేస్తున్నారా అని జస్టిస్ త్రివేది ప్రశ్నించగా... అవునని సాల్వే ధర్మాసనానికి నివేదించారు.
ఈ క్రమంలో కలగజేసుకున్న న్యాయమూర్తి జస్టిస్ అనిరుద్ధ బోస్.... మీ క్లయింట్ కేసులో 17-A వర్తిస్తుందనడానికి ఆధారాలు కనిపిస్తున్నాయని... సాల్వేతో అన్నారు. బెంచ్ పరిశీలన వాస్తవమేనని సాల్వే బదులిచ్చారు. అధికార విధుల నిర్వర్తనకు సంబంధించిన అంశం ఇందులో ఇమిడి ఉందన్నారు. ఇదంతా చూస్తే 10 శాతం ప్రభుత్వం ముందుగా ఇచ్చి 90 శాతం సీమెన్స్ తర్వాత పెట్టడం మూలాన వచ్చినట్లుందని మరో న్యాయమూర్తి జస్టిస్ త్రివేది అన్నారు. ఈ కేసులో అందరికీ బెయిల్ వచ్చిందని... అసలు అరెస్టు అనేదే చట్ట విరుద్ధమని హరీష్ సాల్వే అన్నారు. ప్రతీకార చర్యల నిరోధానికే పార్లమెంటు 17-A చట్టం తెచ్చిందని సాల్వే పునరుద్ఘాటించారు. ఇకపై గతంలో జరిగినవాటికి కూడా 17-A వర్తిస్తుందని అన్వయించుకోవచ్చని హరీష్ సాల్వే అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com