TDP: నేటి నుంచి భువనమ్మ "నిజం గెలవాలి యాత్ర"

TDP: నేటి నుంచి భువనమ్మ నిజం గెలవాలి యాత్ర
చంద్రబాబు అరెస్ట్‌తో మరణించిన కుటుంబాలకు పరామర్శ... చంద్రగిరి నుంచి యాత్ర ప్రారంభం

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై పెట్టిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో కుట్రల్ని ప్రజలకు వివరించడంతోపాటు ...చంద్రబాబు జైలుకు వెళ్లడాన్ని తట్టుకోలేక చనిపోయిన అభిమానులను పరామర్శించేందుకు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సిద్ధమయ్యారు. నిజం గెలవాలి పేరిట ఆమె నేటి నుంచి ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఇవాళ ఉదయం తిరుపతి జిల్లా చంద్రగిరి నుంచి భువనేశ్వరి యాత్ర ప్రారంభిస్తారు. ఇందుకోసం ప్రత్యేక వాహనాన్ని సిద్ధం చేశారు. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మరణించిన అభిమానులు, కార్యకర్తల కుటుంబాలను ఈ యాత్ర ద్వారా భువనేశ్వరి పరామర్శిస్తారు. ఈ యాత్రకు సంబంధించిన బస్సును ఇప్పటికే సిద్ధం చేశారు. బస్సుపై ఎన్టీఆర్‌, చంద్రబాబు, భువనేశ్వరి ఫొటోలతో కూడిన థీమ్‌ను తీర్చిదిద్దారు.


నిజం గెలవాలి యాత్ర విజయవంతం కావాలని తొలుత తిరుమల శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్ వద్ద భువనేశ్వరికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ అధికారులు స్వాగతం పలికారు. మహద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించిన ఆమె క్షేత్ర సంప్రదాయాలను అనుసరించి ధ్వజస్థంభానికి నమస్కరించి... ఆనంద నిలయంలోకి వెళ్లారు. వెంకన్న దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందించారు. భువనేశ్వరి వెంట MLCలు పంచుమర్తి అనురాధ, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రామభూపాల్ రెడ్డి సహా.... పలువురు నేతలున్నారు. ఆలయం వెలుపల భువనేశ్వరిని కలిసేందుకు వచ్చిన కార్యకర్తలను.. టీడీడీ భద్రత సిబ్బంది దూరంగా పంపేశారు.


భువనేశ్వరి తిరుమల నుంచి నేరుగా చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెకు వెళ్లారు. కుటుంబ సంప్రదాయాలను అనుసరించి గ్రామ దేవత గంగమ్మ,.... కుల దేవత నాగాలమ్మకు పూజలు చేశారు. అనంతరం చంద్రబాబు తల్లిదండ్రులైన అమ్మణ్ణమ్మ, ఖర్జూరనాయుడు సమాధుల వద్ద నివాళులర్పించారు.


నారా భువనేశ్వరి తలపెట్టిన నిజం గెలవాలి యాత్రపై తాము ఈ నెల 21నే డీజీపికి లేఖ రాశామని..తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పష్టం చేశారు. అయినా డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి యాత్ర గురించి తెలియదని చెప్పడం పట్ల...ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. డీజీపీకి వచ్చే లేఖలను సజ్జల చూస్తారా అని ప్రశ్నించారు. వెంటనే..నారా భువనేశ్వరి యాత్రకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. . దేశంలోనే ప్రముఖ అవినీతి రాజకీయవేత్త, అత్యంత ధనిక సీఎం జగన్‌ అని జాతీయ మీడియా చెబుతున్న దశలో.. చంద్రబాబుపై బురద చల్లేందుకే అక్రమ కేసు పెట్టి అరెస్టు చేయించారని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ అన్నారు. జగన్‌ పాలనలో రాష్ట్ర అదాయంలో 60శాతం ఎటు పోతుందో లెక్కే లేదన్నారు. చివరకు చిన్నపిల్లలకు పెట్టే పప్పుల చిక్కీలో కూడా అవినీతి బయటపడిందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story