తిరుపతి నుంచి హైదరాబాద్ తిరుగు ప్రయాణమైన చంద్రబాబు

తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో తొమ్మిది గంటల పాటు నిరసన దీక్ష చేపట్టిన చంద్రబాబు... హైదరాబాద్ తిరుగు పయనమయ్యారు. తిరుపతి వెళ్లకుండా ఆంక్షలు విధించిన పోలీసులు దగ్గరుండి బోర్డింగ్ పాస్ తీసుకుని చంద్రబాబును వెనక్కి పంపించారు. ఉదయం నుంచీ ఎయిర్‌పోర్ట్‌లో దీక్ష చేసిన చంద్రబాబును హైదరాబాద్ పంపించేందుకు పోలీసులు మధ్యాహ్నం ఒంటి గంట నుంచే ఒకటి తర్వాత మరొక విమానంంలో టికెట్లు బుక్ చేసినా చంద్రబాబు వెనక్కి తగ్గలేదు. చివరికి రాత్రి ఏడు గంటల 10 నిమిషాలకు చంద్రబాబు హైదరాబాద్ బయల్దేరారు.
తొమ్మిది గంటల పాటు అలుపెరుగని దీక్ష.. ఆరోగ్యం క్షీణిస్తున్నా వెనుకడుగు వేయని పట్టుదల నీరసిస్తున్నా వీడని నిరసన గళం రేణిగుంట విమానాశ్రయంలో ఉదయం నుంచి సాగిన చంద్రబాబు ఆందోళన తీరిది. మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలు, అవకతవకల్ని అడ్డుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడుతూ... తిరుపతిలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టేందుకు వెళ్లిన చంద్రబాబుపై నిర్బంధం కొనసాగింది. రేణిగుంట విమానాశ్రయంలోనే చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు తిరుపతి వెళ్లకుండా ఆంక్షలు పెట్టారు. ధర్నాకు అనుమతి లేదని తిరిగి వెనక్కి వెళ్లాలంటూ సూచనలు చేశారు.
పోలీసుల వైఖరిని నిరసిస్తూ చంద్రబాబు 9 గంటల పాటు నేలపై బైఠాయించి నిరసన తెలిపారు. ఉదయం నుంచి మంచి నీళ్లు కూడా తాగకుండా దీక్ష చేశారు. దీక్ష విరమించాలని పోలీసులు పదేపదే కోరినా చంద్రబాబు వినలేదు. తిరుపతి వెళ్లేందుకు అనుమతించి అరెస్ట్ చేసిన టీడీపీ కార్యకర్తల్ని విడుదల చేస్తేనే దీక్ష విరమిస్తానని తేల్చిచెప్పారు. మధ్యాహ్నం నుంచి చంద్రబాబును హైదరాబాద్ పంపేందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. తిరుపతి వెళ్లేందుకు పోలీసులు ఎంతకీ అనుమతి ఇవ్వకపోవడంతో రాత్రి ఏడు గంటల 10 నిమిషాలకు చంద్రబాబు వెనుదిరిగారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com