Anantapur: దిగ్విజయంగా చంద్రబాబు ప్రాజెక్ట్ బాట

అనంతపురం జిల్లాలో చంద్రబాబు ప్రాజెక్ట్ బాట సాగుతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అప్పర్ పెన్నా, జీడిపల్లి- పేరూరు ప్రాజెక్ట్‌లను చంద్రబాబు పరిశీలించారు. రాష్ట్రానికి ఒక వ్యక్తి ఎంత విధ్వంసం, అన్యాయం చేస్తున్నాడో చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు చంద్రబాబు వివరించారు. బడ్జెట్‌లో జలవనరుల అభివృద్ధికి ఎలాంటి నిధులు కేటాయించడం లేదన్నారు. కేవలం 2.35 శాతం నిధులు ఖర్చు చేస్తే ఎన్ని ప్రాజెక్టులు పూర్తవుతాయని ఆయన ప్రశ్నించారు. పులివెందులకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయో జగన్ చెప్పగలడా అని చంద్రబాబు ప్రశ్నించారు. అనంతపురం జిల్లాలో వైసీపీ నేతలు చెరువుల్ని కబ్జా చేసి వాటిని పూడ్చేస్తున్నారని తెలిపారు. ప్రాజెక్టులకు పూర్వవైభవం తీసుకొచ్చే ముందుచూపు తనకుందన్నారు. జగన్‌కు అడ్డచూపులు, వంకర చూపులే తెలుసునని విమర్శించారు.
హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్ట్‌కు టీడీపీ హయాంలో 4,182 కోట్లు ఖర్చు చేస్తే, వైసీపీ నాలుగేళ్లలో చేసిన ఖర్చు కేవలం 515 కోట్లు మాత్రమేనన్నారు. హంద్రీ-నీవా కాల్వ సామర్థ్యం రెండు దశల్లో పదివేల క్యూసెక్కులకు పెంచుతామని ఇచ్చిన హామీని జగన్ విస్మరించారని చంద్రబాబు మండిపడ్డారు. 6,182 కోట్లకు జీవో విడుదల చేయలేదు...ఇంతవరకు కనీసం టెండర్లు కూడా పిలువలేదన్నారు. జీడిపల్లి -పేరూరు ప్రాజెక్ట్‌కు తమ ప్రభుత్వ హయాంలో 60 కోట్లు ఖర్చు చేస్తే.... వైసీపీ సర్కార్ భూ సేకరణ చేసిన 961 ఎకరాలను రద్దు చేసిందని చంద్రబాబు మండిపడ్డారు.
పుట్టకనుమ రిజర్వాయర్‌ను కూడా రద్దు చేశారన్నారు. కొత్తగా ప్రతిపాదన చేసిన ముట్టాల, తోపుతుర్తి లిఫ్ట్‌ల పనులు సాగడం లేదన్నారు. జీడిపల్లి -బైరవానితిప్ప లిఫ్ట్‌కు సంబంధించి.. నాలుగేళ్లలో అంగుళం పనికూడా ముందుకుసాగలేదన్నారు. మడకశిర బ్రాంచ్ కాల్వ ప్రాజెక్ట్‌ను 805 కోట్ల రూపాయలతో దాదాపుగా పూర్తిచేస్తే.. గత నాలుగేళ్లగా కాల్వ పనులు ఒక్క అడుగుకూడా ముందుకుసాగలేదని చంద్రబాబు ఆరోపించారు. గుంతకల్లు బ్రాంచ్ కెనాల్లో శిథిలావస్థలో ఉన్న అండర్ టన్నెల్స్ మరమ్మతులు చేపట్టని కారణంగా లీకేజీలతో నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com