Chandrababu: హైకోర్టులో చంద్రబాబుకు ఎదురుదెబ్బ..

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అక్రమ అరెస్ట్‌ను సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించిన మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబుకు నిరాశ ఎదురైంది. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్ట్ కొట్టివేసింది. సీఐడీ తరుపు లాయర్లతో జడ్జి ఏకీభవించారు. పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు ఏకవాఖ్యంతో కోర్ట్ తీర్పునిచ్చింది.
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు న్యాయమూర్తి కేవలం ఒకే ఒక వాక్యంతో తీర్పును వెలువరించారు. 'ది పిటిషన్ ఈజ్ డిస్ మిస్డ్' అని చెప్పి, బెంచ్ దిగి జడ్జి వెళ్లిపోయారు. ఈ తీర్పుతో స్కిల్ కేసులో సీఐడీ వినిపించిన వాదనలను హైకోర్టు సమర్థించినట్టయింది. తీర్పు కాపీ అందుబాటులోకి వస్తే... జడ్జి ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకుని తీర్పును వెలువరించారనే విషయం అర్థమవుతుంది.
కాగా.. స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసు, అక్రమ అరెస్టు వ్యవహారాలకు సంబంధించి తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్, అనంతరం ఏసీబీ కోర్టు జారీ చేసిన రిమాండ్ ఉత్తర్వులను సవాలు చేస్తూ చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ కేసులో రిమాండ్ చెల్లదని సవాలు చేశారు. దీనిపై ఈనెల 19న వాదనలు జరిగాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాదులు హరీశ్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా, సీఐడీ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పుని శుక్రవారానికి రిజర్వు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఏపీ హైకోర్టులో ఊరట దక్కకపోవడంతో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని టీడీపీ నిర్ణయించింది. హైకోర్ట్ తీర్పును సుప్రీంలో సవాలు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే పార్టీ సీనియర్ నేతలు చర్చించి నిర్ణయం తీసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com