CBN: లక్ష్మీ మిట్టల్‌తో చంద్రబాబు కీలక భేటీ

CBN: లక్ష్మీ మిట్టల్‌తో చంద్రబాబు కీలక భేటీ
X
ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం... సానుకూలంగా స్పందించిన లక్ష్మీ మిట్టల్

ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా ఇన్‌వెస్ట్ ఏపీ నినాదంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ దావోస్ పర్యటనకు వెళ్లారు. ప్రముఖ కంపెనీల సీఈవోలతో భేటీ అయ్యి, ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ పారిశ్రామిక వేత్త లక్ష్మీ మిట్టల్ తో చంద్రబాబు బృందం భేటీ అయింది. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అన్నీ అవకాశాలు ఉన్నాయని.. ఏపీలో పెట్టుబడులకు ముందుకు రావాలని కోరారు. ఈ సందర్భంగా భావనపాడులో పెట్రో కెమికల్ హబ్ ఏర్పాటుకు పెట్టుబడులకు లోకేశ్‌... లక్ష్మీ మిత్తల్ సంస్థ ప్రతినిధులను ఆహ్వానించారు. పెట్రోకెమికల్స్ అన్వేషణకు భావనపాడు వ్యూహాత్మక ప్రాంతమని లోకేశ్ వివరించారు. ఏపీలో సోలార్ సెల్ తయారీ ప్లాంటు ఏర్పాటును పరిశీలించాలని కోరారు. భావనపాడు-మూలపేట ప్రాంతం తయారీ, ఆర్‌అండ్‌డీ, లాజిస్టిక్స్ సౌకర్యాలను నెలకొల్పడానికి, పెట్రోకెమికల్స్, గ్రీన్ ఎనర్జీలో నూతన ఆవిష్కరణలకు అసమానమైన అవకాశాలు కలిగి ఉందని చెప్పారు.

ఇప్పటికే ప్రారంభించామన్న లక్ష్మీమిత్తల్

ఆర్సెలార్ మిత్తల్‌, జపాన్‌కు చెందిన నిప్పాన్ స్టీల్ జేవీ సంయుక్తంగా 17.8 మిలియన్ టన్నుల కెపాసిటీతో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్రాజెక్ట్‌ ఏర్పాటు ప్రక్రియను ఏపీలో ప్రారంభించామని లక్ష్మీమిత్తల్‌ గుర్తుచేశారు. అనకాపల్లి సమీపంలో 2 దశల్లో రూ.1.4 లక్షల కోట్ల పెట్టుబడితో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

ఏపీలో ఏఐ యూనివర్సిటీ: నారా లోకేశ్

ఏపీలో స్కిల్‌, ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. దావోస్ లో పెట్టుబడుల వేటలో ఉన్న లోకేశ్.. దిగ్గజ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఐటీ అభివృద్ధికి చంద్రబాబు ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ఫైల్స్‌ పట్టుకుని గతంలో న్యూయార్క్‌ వీధుల్లో చంద్రబాబు తిరిగారని గుర్తుచేశారు. ఆలోచనల్లో చంద్రబాబుతో పోటీపడలేక పోతున్నామన్నారు.

విదేశీ గడ్డపై లోకేశ్ నోట రెడ్ బుక్ మాట

జ్యురిచ్‌ పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రెడ్‌బుక్‌ అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. రెడ్‌బుక్‌ తన పని తాను చేసుకుపోతుందని లోకేష్‌ తేల్చిచెప్పారు. జ్యురిచ్‌లో గల హిల్టన్ హోటల్‌లో స్విట్జర్లాండ్‌లోని భారత రాయబారి మృదుల్ కుమార్‌‌తో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ బృందం భేటీ అయింది. ఈ సందర్భంగా లోకేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Tags

Next Story