లంచ్ చేయని చంద్రబాబు.. అర్ధరాత్రి ప్రెస్‌మీట్లు.. వరద ప్రాంతాల్లో నిరంతర పరిశీలన
బెజవాడ ముంపు ప్రాంతాల్లోనే సీఎం చంద్రబాబు ఉంటున్నారు. అర్ధరాత్రి ప్రెస్ మీట్లు పెడుతూ జనాన్ని అప్రమత్తం చేస్తున్నారు. జనం నిద్ర పోలేకపోతున్నారని.. తాను సాధారణ పరిస్థితులను వీలైనంత త్వరగా రీస్టోర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పారు.
మంగళవారం సితార సెంటర్లో బయలు దేరిన ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్లీ వెనక్కి వస్తారని అధికారులు కాన్వాయ్ ను అక్కడే సిద్ధంగా ఉంచారు. అయితే సీఎం అక్కడికి రాకపోగా ఏ ప్రాంతానికి వస్తారో తెలియకపోవడంతో కాన్వాయ్ ను పలు చోట్లకు తిప్పారు. ప్రతి ప్రాంతాన్ని చూడాలని, సాధ్యమైనంత ఎక్కువ మందిని కలవాలని చంద్రబాబు భావించారు. సితార సెంటర్ నుంచి అనేక ప్రాంతాల్లో నాలుగున్నర గంటల పాటు ఆయన పర్యటన జేసీబీపైనే సాగింది. మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా ఆయన వరద బాధిత ప్రాంతాల్లోనే పర్యటించారు.
సాయంత్రం 5 గంటల సమయంలో వదర ప్రాంతం నుంచి బయటకు వచ్చారు. సితార సెంటర్ వద్ద వరద ప్రాంతంలో అడుగు పెట్టిన ముఖ్యమంత్రి, పలు చోట్ల పర్యటించి రామవరప్పాడు వంతెన సమీపంలో సాధారణ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడికి వచ్చేసరికి ఆయన కాన్వాయ్ కూడా ఆ ప్రాంతానికి రాలేదు. దీంతో మరికొంత దూరం ఆయన జేసీబీపైనే ముందుకు సాగారు. సీఎం రూట్ పై సమాచారం అందుకున్న కాన్వాయ్ అక్కడికి చేరుకోవడంతో అక్కడ నుంచి తన వాహనంలో విజయవాడ కలెక్టర్ కార్యాలయానికి చంద్రబాబు చేరుకున్నారు. ఈ నాలుగున్నర గంటల పర్యటనలో ఎక్కడికక్కడ అధికారులకు ఆదేశాలు, సూచనలు ఇస్తూ ముందుకు సాగారు. చంద్రబాబుతో పాటు విజయవాడ పోలీస్ కమిషనర్ కూడా పర్యటనలో ఉన్నారు. ఇతర వాహనాలు వెళ్లే అవకాశం లేకపోవడంతో సీఎం సెక్యూరిటీలోని కొంత మంది భద్రతా సిబ్బంది మాత్రమే చంద్రబాబుతో పాటు ఉంటున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com