BABU: జైల్లో చంద్రబాబుకు ప్రత్యేక సౌకర్యాలు

BABU: జైల్లో చంద్రబాబుకు ప్రత్యేక సౌకర్యాలు
ఆదేశాలు జారీ చేసిన ఏసీబీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి... నేడు బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు

జడ్ ప్లస్ భద్రతలో ఉన్న మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు..జైల్లో అవసరమైన అన్ని ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం సూపరింటెండెంట్‌ను ..ఏసీబీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి హిమబిందు ఆదేశించారు. చంద్రబాబుకు ప్రాణహాని ఉన్నందున జైల్లో ఆయనకు ప్రత్యేక గదిని కేటాయించి తగిన భద్రతనూ కల్పించాలన్నారు. ఇంటి నుంచి ఆహారం, ఔషధాలనూ అనుమతించాలని న్యాయమూర్తి ఆదేశాల్లో పేర్కొన్నారు. జైల్లో చంద్రబాబుకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించేలా ఆదేశించాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వం ఆయనకు జడ్ ప్లస్ భద్రతను కల్పించిందని పిటిషన్ లో పేర్కొన్నారు.


అందువల్ల జైల్లో సాధారణ బ్లాక్ లో ఇతర ఖైదీలతో కలిపి ఉంచితే ఆయన ప్రాణాలకు ప్రమాదం ఉందన్నారు. అంతేకాకుండా చంద్రబాబుకు 73 ఏళ్ల వయస్సు అని....వివిధ రకాల అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న కారణంగా ఆయన వైద్యులు సూచించిన ఆహారాన్ని తీసుకోవడంతోపాటు మందులు కూడా వాడాల్సి ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న చంద్రబాబు జైలు నిబంధనల ప్రకారం ప్రత్యేక సౌకర్యాలకు అర్హులు కాబట్టి ఆయనకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబుకు హౌస్ అరెస్ట్ ను అనుమతించాలని ఆయన తరఫు న్యాయవాదులు మరో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణను కోర్టు నేటికి వాయిదా వేసింది. చంద్రబాబు బెయిల్ పిటిషన్ ను నేడు దాఖలు చేయనున్నారు.


మరోవైపు చంద్రబాబుకు రిమాండ్ విధించిన వెంటనే ఆయనను కస్టడీకి కోరుతూ.... విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు పిటిషన్ వేశారు. ఈ కస్టడీ పిటిషన్ ఏసీబీ కోర్టులో ఇవాళ విచారణకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు చంద్రబాబు తరఫున బెయిల్ పిటిషన్ ఇవాళ దాఖలు చేస్తామని ఆయన తరపు న్యాయవాదులు చెప్పారు. బెయిల్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేయాలా ఏసీబీ కోర్టులో దాఖలు చేయాలనేది ఇవాళ నిర్ణయిస్తామని వివరించారు.

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటు వ్యవహారంలో అవినీతికి పాల్పడ్డారంటూ సీఐడీ నమోదుచేసిన కేసులో.... ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజయవాడలోని అనిశా కోర్టు 14 రోజుల రిమాండు విధించింది. ఆదివారం ఉదయం 8 గంటల 15 నిమిషాల నుంచి మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాల వరకు సుదీర్ఘంగా జరిగిన వాదనల అనంతరం చంద్రబాబుకు ఈ నెల 22 వరకు రిమాండు విధిస్తూ అనిశా కోర్టు న్యాయాధికారి హిమబిందు ఉత్తర్వులు జారీచేశారు.

Tags

Read MoreRead Less
Next Story