Chandrababu: మరింత క్షీణించిన చంద్రబాబు ఆరోగ్యం

రాజమండ్రి కేంద్రకారాగారంలో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు... వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఏడు పదుల వయసులో ఆయనకు కంటి సమస్యలతో పాటు ఒంటిపై దద్దుర్లు నడుము కింది భాగం వరకు విస్తరించాయని సమాచారం. మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయి నెలరోజులకు పైనే అయ్యింది. ఇలా చాలాకాలంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా వున్న ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. వయసు మీదపడిన చంద్రబాబును అనేక రకాల ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయని వైద్యుల నివేదిక బట్టి తెలుస్తోంది.
రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న మాజీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబుకు గతంలో కంటి వైద్యం చేసిన హైదరాబాద్ L.V. ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌కు చెందిన వైద్య నిపుణులు ఆయనకున్న కంటి సమస్యలు, చేయాల్సిన చికిత్స, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఈ నెల 21న ఓ నివేదికలో వివరించారు. చంద్రబాబుకు 'యాంగిల్ క్లోజర్ గ్లకోమా' అనే కంటి సమస్య ఉంది. దానికి గతంలో లేజర్ చికిత్స చేశారు. ‘ఇంట్రా ఆక్యులర్ ప్రెజర్‌ను ఎప్పటికప్పుడు.. నిర్దిష్ట కాలావధుల్లో ఆసుపత్రిలో వైద్య నిపుణులు పర్యవేక్షించాలి. అలాగే ఆయనకు కంటిలో శుక్లాలు ఏర్పడినట్లు ఈ ఏడాది మే 23న గుర్తించి, జూన్ 21న ఎడమ కంటికి శస్త్రచికిత్స చేశారు. ఆ తర్వాత ఎడమ, కుడి కంటి చూపుల్లో వ్యత్యాసం ఎక్కువగా ఉన్నందున 3 నెలల్లో కుడి కంటి శుక్లానికి కూడా సర్జరీ చేయాలని ఎల్‌వీ ప్రసాద్ వైద్యులు సూచించారు. వెంటనే ఆయనకు ఆపరేషన్ అవసరమని డాక్టర్లు సూచించినా జైలు అధికారులు బయటపెట్టడం లేదని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు.
చంద్రబాబు మరికొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు బుధవారం ఆయన్ను పరీక్షించిన ప్రభుత్వ వైద్య నిపుణులు ఇచ్చిన నివేదికను బట్టి తెలుస్తోంది. బాబు వెన్ను కింది భాగంలో నొప్పి, మలద్వారం వద్ద నొప్పితో బాధపడుతున్నారని, ఒంటిపై దద్దుర్లు నడుము కింది భాగం వరకు విస్తరించాయని ఆ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. ఇక రాజమండ్రిలో ఉక్కపోత వాతావరణం కారణంగా డీహైడ్రేషన్ కు గురవడమే కాదు చర్మ సంబంధిత సమస్యతో చంద్రబాబు బాధపడ్డారు. అయితే కోర్టు ఆదేశాలతో చంద్రబాబుకు ఏసి సదుపాయం కల్పించడంతో డీహైడ్రేషన్ తప్పింది... కానీ చర్మ సమస్య మాత్రం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఆయన ఒంటిపై దద్దుర్లు మరింత ఎక్కువై నడుం కిందవరకు విస్తరించినట్లు తెలుస్తోంది. చల్లటి వాతావరణం వుంటూ శరీరానికి బాగా గాలితగిలే దుస్తులను ధరిస్తే ఈ దద్దుర్లు తగ్గే అవకాశాలున్నాయని డాక్టర్లు సూచించారట.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com