CBN: ఎంపీడీవో కుటుంబాన్ని పరామర్శించిన చంద్రబాబు
నాలుగు రోజుల నుంచి కనిపించకుండా పోయిన నర్సాపురం ఎంపీడీవో వెంకట రమణారావు ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే రమణారావు కుటుంబ సభ్యులను సీఎం చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. రమణారావు చివరిగా ఇంటి నుంచి వెళ్లేటప్పుడు ఏం చెప్పారు? ఆయన ఒత్తిడికి గురవ్వడానికి గల కారణాలేంటి? వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొద్ది రోజులుగా రమణారావు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని, ఉద్యోగ సంబంధిత విషయాల్లో ఇబ్బంది పడ్డారని ఆయన సతీమణి సునీత తెలిపారు. ఆమెతో పాటు, కుమారుడు సాయిరాంతోనూ సీఎం ఫోన్‌లో మాట్లాడారు. గతంలో ఎప్పుడైనా ఏవైనా అంశాలు మీ దృష్టికి తెచ్చారా అని సీఎం అడిగారు. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామన్నారు.
నిజాయితీ పరుడు, సమర్థుడైన అధికారి ఆచూకీ లేకుండా పోవడంపై ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు.ఎంపీడీవో కుటుంబాన్ని ఆదుకుంటామని, ఘటనపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. బాధిత కుటుంబం వద్ద ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణితో కూడా సీఎం మాట్లాడి పలు సూచనలు చేశారు. ఘటనపై లోతుగా దర్యాప్తు జరపాలని ఎప్పటికప్పుడు సీఎం కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఎంపీడీవో చివరిసారిగా మచిలీపట్నం రైల్వేస్టేషన్ నుంచి నేరుగా మధురానగర్ స్టేషన్‌లో దిగినట్లు పోలీసులు గుర్తించారు. రైల్వేస్టేషన్ నుంచి కాల్వకట్ట వరకు సుమారు 2 కిలోమీటర్లు ఆయన నడిచినట్లు చెప్పారు. అర్ధరాత్రి సమయంలో కాలువలోకి దూకి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఒక వ్యక్తి నీళ్లలో దూకినట్లుగా పెద్దగా శబ్దం వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. తండ్రి ఆచూకీ కోసం ఆయన కుమారులు ఏలూరు కాల్వ కట్టపైనే ఎదురుచూశారు. పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది కేసరపల్లి నుంచి విజయవాడ వైపు గాలిస్తున్నారు. రెండు బోట్లలో 30 మంది సిబ్బంది ఇందుకోసం పనిచేస్తున్నారు.
అదృశ్యమైన మండవ వెంకట రమణారావు కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్టు కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్‌రావు గురువారం తెలిపారు. ప్రాథమిక దర్యాప్తు మేరకు రమణారావు మాధవాయిపాలెం ఫెర్రీ విషయంలో 55 లక్షల బకాయిల విషయంలో తీవ్ర ఒత్తిడికి గురైనట్టు తెలిసిందని ఎస్పీ తెలిపారు. అలాగే కొన్ని ఫోన్‌ల నుంచి కాల్స్ వచ్చినట్లు, ఆ కాల్స్ విషయంలో మరింత ఒత్తిడికి గురైనట్టు, కొంత డబ్బును ఆ కాలర్స్‌కు బ్యాంకు ద్వారా జమ చేసినట్టు తెలిసిందన్నారు. వీటన్నింటి మీద పూర్తి స్థాయి దర్యాప్తు జరుగున్నట్టు ఎస్పీ తెలిపారు. ఈ కేసు దర్యాప్తు, గాలింపు చర్యలకు ప్రత్యక్ష పర్యవేక్షణలో నలుగురు డీఎస్పీలు, నలుగురు సీఐలు, 15 మంది ఎస్సైలు, 150 మంది సిబ్బంది పని చేస్తున్నారని తెలిపారు. ఈ మొత్తం దర్యాప్తును పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీఅద్నాన్ నయీం అస్మి సహకారంతో ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్ పర్యవేక్షిస్తున్నట్టు ఎస్పీ తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com