సీఎం జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ

సీఎం జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ

ఏలూరులో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలంటూ సీఎం జగన్‌కు.. టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. అక్కడి జనజీవనం అల్లకల్లోలం కావడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఐదారు రోజుల్లో ఆరేడు వందల మంది ఆసుపత్రులపాలు కావడం విషాదకరమన్నారు. రోజుకో రీతిలో రోగుల్లో లక్షణాలు మారిపోవడంపై భయాందోళనలు ఉన్నాయన్నారు. బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోవడం, కారణాలు తెలియకపోవడం ఆందోళనకరమని చంద్రబాబు పేర్కొన్నారు. సురక్షిత తాగునీరు ప్రజలకు అందించడం ప్రభుత్వ కర్తవ్యమన్నారు. నీటిని పొందే హక్కు పౌరుల ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు పేర్కొందని.. భారత రాజ్యాంగం ఆర్టికల్ 21కూడా అదే నిర్దేశించిందన్నారు.

సురక్షిత నీటి సరఫరాలో, పారిశుధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం కావడం శోచనీయమన్నారు చంద్రబాబు. ఏలూరు దుర్ఘటనలకు కారణాలు ఏమిటి..? ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, మూలాల అన్వేషణ జరపాలన్నారు. ఇప్పటివరకు చేపట్టిన పరీక్షల వివరాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. తద్వారా బాధితుల్లో నమ్మకం పెంచాలని, వారి విశ్వాసం పొందాలని, ప్రజలందరికీ ధైర్యం చెప్పాలన్నారు చంద్రబాబు. రేపు ఏమి జరుగుతుందోననే భయాందోళనలను తొలగించాలని సూచించారు.

ఏలూరులో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని తక్షణమే ప్రభుత్వం ప్రకటించాలన్నారు చంద్రబాబు. తాగునీటిలో లెడ్, నికెల్ ఉన్నాయనే సమాచారంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయన్నారు. దీనివల్ల గర్భిణులు, చిన్నారులు, వృద్ధుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుందన్నారు. ఏలూరులో ప్రతిఒక్కరికి ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డులను అందజేయాలని... దీర్ఘకాలిక ప్రాతిపదికపై ప్రతి రోగిని నిశితంగా పర్యవేక్షించాలన్నారు. జాతీయ, అంతర్జాతీయ వైద్య నిపుణులతో బాధితులకు అత్యుత్తమ వైద్యం అందించాలని లేఖలో పేర్కొన్నారు. ఏలూరు దుర్ఘటనపై సైంటిఫిక్ స్టడీ చేయాలని.. హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలనే ఆలోచన రాకపోవడం మరో వైఫల్యమని అన్నారు.

ఎక్కడికక్కడ క్విక్ రెస్పాన్స్ టీములను ఏర్పాటు చేయాలన్నారు చంద్రబాబు. సత్వర ఉపశమన చర్యలు, సహాయక చర్యలు చేపట్టాలని..హుద్ హుద్ తరహాలో మొబైల్ మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి బాధితుడికి ఆరోగ్య బీమాతో పాటు, జీవిత బీమా కల్పించాలని లేఖలో పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలపై కూడా అధ్యయనం చేయాలన్నారు. ఏలూరుతో పాటు అన్ని పట్టణాలు, నగరాలు, గ్రామాల్లోని జనావాసాల్లో తాగునీటి వనరులను ప్రక్షాళన చేయాలని సూచించారు. 13 జిల్లాల్లో తాగునీరు సురక్షితమో కాదో తక్షణమే ప్రత్యేక పరీక్షలు జరపాలని డిమాండ్‌ చేశారు చంద్రబాబు. ఏలూరుతో పాటు రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్యంపై భరోసా ఇవ్వాలన్నారు.

Tags

Read MoreRead Less
Next Story