High Court : చంద్రబాబు అరెస్టును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టును సవాలు చేస్తూ ఏపీ హైకోర్టులో ఇవాళ చంద్రబాబు తరపు న్యాయవాది లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు. ఏసీపీ కోర్టు తీర్పును సవాలు చేశారు. చంద్రబాబును అరెస్టు చేసిన తీరు అక్రమమని, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17-A ప్రకారం అనుమతి లేకుండా ఎలా అరెస్టు చేస్తారని పిటిషన్ లో పేర్కొన్నారు. గవర్నర్ అనుమతి తీసుకోకుండా ఎలా అరెస్టు చేస్తారని పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ పిటిషన్ ను రేపు విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.
మరోవైపు చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టు మంగళవారం తీర్పు చెప్పనుంది. చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో ఆయన్ను అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటులో స్కాం జరిగిందని దాంట్లో చంద్రబాబు సూత్రధారి అనే ఆరోపణలతో సీబీఐ అధికారులు ఆయన్ను అరెస్టు చేశారు. అనంతరం విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా చంద్రబాబుకు సెప్టెంబర్ 22 రిమాండ్ విధించింది. దీంతో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. జైలులో స్నేహ బ్లాక్ మొత్తాన్ని చంద్రబాబుకు కేటాయించారు. బ్లాక్ లో ఆయనకు ఒక ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. జైలులో చంద్రబాబుకు సహాయకుడిగా ఓ ఖైదీని ఏర్పాటు చేశారు. చంద్రబాబు ఆరోగ్యంపై చేసిన విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకుని ప్రతి రోజూ ఇంటి నుంచి భోజనం తెప్పించుకునేలా అనుమతి మంజూరు చేసింది ఏసీబీ కోర్టు. ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబును ప్రత్యేక గదిలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంచారు.
మరోవైపు చంద్రబాబు రిమాండ్‌ను హౌస్ అరెస్ట్‌గా పరిగణించాలంటూ చంద్రబాబు తరపున పిటీషన్ దాఖలు చేసిన సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్ద్ లూథ్రాకు, సీఐడీ తరపున అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డికి మధ్య నిన్నంతా వాదనలు జరిగాయి. ఎన్ఎస్‌జి భద్రతలో ఉన్న చంద్రబాబుకు జైలులో ప్రమాదముందని సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా తెలిపారు. అయితే జైలులో చంద్రబాబుకు పూర్తి భద్రతతో పాటు 24 గంటలు వైద్య బృందం, సీసీ కెమేరా పర్యవేక్షణ ఉందని సీఐడీ వాదించింది. చంద్రబాబు హౌస్ కస్డడీ విషయంలో ఇవాళ ఏసీబీ కోర్టు తీర్పు వెల్లడించనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com