AP: ఏపీలో మొదలైన పక్షాళన

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుతీరక ముందే, చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయకుండానే... వివిధ శాఖల్లో ప్రక్షాళన మొదలైంది. వైసీపీ హయాంలో ఆ పార్టీ నాయకులతో అంటకాగి, అడ్డగోలు దోపిడీకి యథేచ్ఛగా సహకరించిన అధికారులపై వేటు, డిప్యుటేషన్‌పై వచ్చిన అధికారులు ఈ హడావుడిలో రిలీవై వెళ్లిపోకుండా చూసే కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి.
చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయక ముందే...ఆయన ఆలోచనలు, ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం పరుగులు తీయడం మొదలుపెట్టింది. వైకాపా హయాంలో తీవ్రస్థాయిలో ఆరోపణలు, వివాదాలకు నిలయాలైన ప్రభుత్వశాఖలు, విభాగాల్లో ముఖ్యమైన దస్త్రాల్ని, పత్రాల్ని నాశనం చేయకుండా నిరోధించే చర్యలు మొదలయ్యాయి. మంత్రుల పేషీలు, ప్రభుత్వ శాఖలు, విభాగాల నుంచి దస్త్రాలు, పత్రాలేవీ బయటకుపోకుండా భద్రపరచాలని గవర్నర్ కార్యాలయం ఆదేశాలిచ్చింది. వైకాపాతో అంటకాగుతూ, పూర్తిగా ఆ పార్టీ ప్రయోజనాల కోసమే పనిచేసిన సీఎస్ జవహర్‌రెడ్డిని ఇప్పటికే సెలవుపై పంపించారు. అత్యంత వివాదాస్పద అధికారులుగా పేరొందిన గనులశాఖ డైరెక్టర్ వెంకట్‌రెడ్డి, ఏపీ ఫైబర్‌నెట్ ఎండీ మధుసూదన్‌రెడ్డి, సీఐడీ చీఫ్ సంజయ్, సిట్ చీఫ్ కొల్లి రఘురామ్‌రెడ్డిపై బదిలీ వేటు పడింది. జగన్ ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయల అవినీతికి కేంద్ర బిందువులైన గనులు, ఎక్సైజ్‌శాఖలో ఇప్పటికే తీవ్రస్థాయిలో ప్రకంపనలు మొదలయ్యాయి. దస్త్రాలు, కీలక డాక్యుమెంట్లు తస్కరించారన్న ఫిర్యాదుపై ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై సీఐడీ కేసు పెట్టింది.
గత ఐదేళ్లలో యథేచ్ఛగా చెలరేగిపోయిన అధికారుల్లో ఈ పరిణామాలు వణుకు పుట్టిస్తున్నాయి. ఐదేళ్ల జగన్ పాలనలో తీవ్ర విధ్వంసానికి గురైన వ్యవస్థల్ని ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా గాడిన పెట్టాలన్న కృతనిశ్చయంతో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. ఆ సంకేతాలకు తగ్గట్టుగానే అధికార యంత్రాంగం వేగంగా కదులుతోంది. జగన్ పాలనలో అత్యంత వివాదాలకు, అవినీతికి నిలయాలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న గనులు, ఎక్సైజ్ శాఖలపై ఎన్నికల ఫలితాలు రాగానే ప్రభుత్వం దృష్టిపెట్టింది. బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి వైకాపాకి అనుకూలంగా పనిచేస్తున్నారన్న ఫిర్యాదులతో ఎన్నికల సమయంలో ఈసీ బదిలీ చేసింది. ఆయన ఈ నెల 6న సంస్థ ప్రధాన కార్యాలయం నుంచి దస్త్రాలు, కంప్యూటర్ పరికరాలు, ఇతర పత్రాల్ని కారులో దొంగతనంగా తరలిస్తుండగా చూశానని కంచికచర్లకు చెందిన గద్దె శివకృష్ణ ఫిర్యాదుచేయగా.. సీఐడీ కేసు పెట్టింది. శుక్రవారం సీఐడీ బృందాలు హుటాహుటిన హైదరాబాద్ వెళ్లి వాసుదేవరెడ్డి నివాసంలో సోదాలు నిర్వహించాయి. గత ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వ పెద్దలు, ఆ పార్టీ నాయకులు, వారి అస్మదీయులు మద్యం తయారీ, కొనుగోలు, సరఫరా, విక్రయాలన్నీ తమ ఆధీనంలోకి తెచ్చుకుని, జే బ్రాండ్ మద్యంతో భారీగా దోచుకున్నారు. ఎన్నికల్లో వైకాపా ఘోరంగా ఓడిపోవడంతో... ఆ దోపిడీ, కుంభకోణానికి సంబంధించిన కీలక ఆధారాల్ని, పత్రాల్ని, హార్డ్‌డిస్క్‌లను మాయం చేసేందుకు వాసుదేవరెడ్డి ప్రయత్నించినట్టు సీఐడీ గుర్తించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com