Chinna Jeeyar Swamy : ఏపీలో రోడ్ల దుస్థితిపై చినజీయర్ స్వామి వ్యంగ్యాస్త్రాలు

Chinna Jeeyar Swamy : ఏపీలో రోడ్లు ఎలా ఉన్నాయో తనదైన శైలిలో వ్యంగ్యంగా వివరించారు చినజీయర్ స్వామి. రాజమహేంద్రవరంలో జరిగిన ఓ ఉపన్యాస కార్యక్రమంలో ఏపీలో రోడ్లపై కామెంట్ చేశారు. ప్రయాణం చేసేటప్పుడు ఒడిదుడుకులు ఉండవచ్చు.. ఒక్కోసారి గోతులూ ఎక్కువ ఉండవచ్చు అంటూ మొదలుపెట్టారు. దీంతో సభలో ఉన్న వారికి స్వామి ఏ రోడ్ల గురించి అంటున్నారో అర్ధమైపోయింది. ఎక్కువ సస్పెన్స్ పెట్టకుండా జంగారెడ్డిగూడెం నుంచి రాజమహేంద్రవరం వరకు రావడానికి చాలా బాగుంది అంటూ వ్యంగంగా అసలు విషయం బయటపెట్టారు. ప్రయాణం చక్కగా జ్ఞాపకం ఉండేటట్టు ఉంది అంటూ తన ఆధ్యాత్మిక ప్రసంగంలో శృతి చేసి కలిపేశారు. దీంతో సభలో ఉన్న వాళ్లంతా ఒక్కసారిగా ఫక్కున నవ్వారు.
ఏపీఐఐసీ మాజీ ఛైర్మన్ శివరామ సుబ్రమణ్యం ఆహ్వానంతో రాజమండ్రిలో ఆధ్యాత్మిక ప్రవచనానికి వెళ్లారు చినజీయర్ స్వామి. సాధారణంగా జంగారెడ్డిగూడెం నుంచి రాజమండ్రి వరకు ప్రయాణం అంటే దాదాపు 2 గంటలు పడుతుంది. కానీ ఎక్కడికక్కడ గోతుల కారణంగా ఇప్పుడా జర్నీకి 3 గంటలు పట్టిందన్నారు చినజీయర్ స్వామి. గట్టిగా కొడితే ఇదే మూడు, మూడున్నర గంటల్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లిపోవచ్చు. కాని, చినజీయర్ స్వామికి కేవలం జంగారెడ్డిగూడెం నుంచి రాజమండ్రికే 3 గంటలు పట్టడం అంటేనే రోడ్ల దుస్థితి అర్థం చేసుకోవచ్చంటున్నారు.
చినజీయర్ స్వామి మాటల్లో ఏపీ ప్రభుత్వ అసమర్థత బయటపడిందని మాట్లాడుకుంటున్నారు జనం. మొన్నామధ్య కేటీఆర్ కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రజలపై రకరకాల పన్నులు వేసి, టోల్ ఫీజు వసూలు చేస్తున్న జగన్ సర్కార్.. రోడ్లను మాత్రం పట్టించుకోలేదని జనం మూడేళ్లుగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. రోడ్ల దుస్థితిని వివరించేందుకు గతంలో టీడీపీ నేతలు రోడ్డు గుంతల్లో వలలతో చేపలు పట్టారు. జనసేన పార్టీ డిజిటల్ క్యాంపెయిన్ చేపట్టింది. అయినా సరే.. ఇప్పటి వరకు రోడ్లను బాగుచేయలేకపోయిందన్న విమర్శను జగన్ సర్కార్ మూటగట్టుకుంటోంది.
చినజీయర్ స్వామి వ్యంగ్యాస్త్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని రోడ్ల దుస్థితిపై జనం రోజూ తిట్టుకుంటున్నారు. గడప గడప కార్యక్రమంలో రోడ్లపై నిలదీయని వారు లేరు. సరిగ్గా ఇదే సమయంలో చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు మరింత సెన్సేషన్ అవుతున్నాయి. రాష్ట్రంలో నడిచేందుకు రోడ్లు కూడా లేవంటూ జనం గగ్గోలు పెడుతున్నారని నారా లోకేష్ విమర్శించారు. రాజకీయాలకు దూరంగా, ఆధ్యాత్మిక ప్రపంచానికి దగ్గరా ఉండే చిన జీయర్ స్వామి కూడా ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల దుస్థితిపై ఆవేదనతో స్పందించారని అన్నారు. చినజీయర్ స్వామి వ్యాఖానించడం బట్టే ఏపీలో రహదారులు ఎంత దారుణంగా ఉన్నాయో స్పష్టమవుతోందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com