Darapaneni Narendra: సీఐడీ అదుపులో టీడీపీ రాష్ట్రమీడియా ఇన్‌ఛార్జ్ దారపనేని..

Darapaneni Narendra: టీడీపీ రాష్ట్రమీడియా ఇంఛార్జి దారపనేని నరేంద్రను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు GGH వైద్యులు సీఐడీ ఆఫీసుకు చేరుకున్నారు. దారపనేనికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. దారపనేని ఆరోగ్య పరిస్థితిపై కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తన భర్తను బలవంతంగా తీసుకెళ్లారని నరేంద్ర భార్య సౌభాగ్యం తెలిపారు. బుధవారం సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో ఏడుగురు సీఐడీ అధికారులమంటూ వచ్చారని...ఎనిమిదిన్నర గంటల సమయంలో తన భర్తను తీసుకెళ్లారని చెప్పారు. తన భర్తను అక్రమంగా అరెస్టు చేశారని...ఆయనకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. ఎందుకు అరెస్టు చేస్తున్నారని అడిగినా పోలీసులు సమాధానం చెప్పలేదన్నారు.
నరేంద్ర అరెస్టును చంద్రబాబు ఖండించారు. కోర్టు ఎన్నిసార్లు చీవాట్లు పెట్టినా సీఐడీ పోలీసుల తీరు మారడం లేదన్నారు. ఇదే కేసులో జర్నలిస్ట్ అంకబాబు అరెస్టును కోర్టు తప్పుపట్టిందని గుర్తు చేశారు. పార్టీ ఆఫీసులో పని చేసేవారిని అరెస్టు చేసి భయపెట్టాలనేది సీఎం జగన్ వైఖరి అని ఆరోపంచారు. ఇలాంటి కేసుల్లో 41-A నోటీసు ఇవ్వాలని నిబంధనలు స్పష్టంగా చెపుతున్నా...సీఐడీ అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరించారన్నారు. నోటీసులు ఇవ్వకుండా రాత్రిపూట అరెస్టులు కోర్టులో నిలబడవన్నారు.
నరేంద్ర కుటుంబసభ్యులతో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. నరేంద్ర అరెస్టుతో ఆందోళనలో ఉన్న కుటుంబసభ్యులకు చంద్రబాబు ధైర్యం చెప్పారు. నరేంద్రపై పెట్టిన తప్పుడు కేసు కోర్టులో నిలబడదని..పార్టీ అండగా ఉంటుందన్నారు. నరేంద్ర అరెస్టుపై నారా లోకేష్ సైతం మండిపడ్డారు. జగన్ సర్కార్ అరాచక అరెస్టులకు మరోసారి తెగబడిందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com