PV Sunil Kumar: సీఐడీ మాజీ చీఫ్ సునీల్‌కుమార్ సస్పెండ్

సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. సునీల్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముందస్తు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లడంతో పాటు మాజీ ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధించిన కేసులో ఆయనపై అభియోగాలు ఉన్నాయి. 2020 నుంచి 2024 మధ్య పీవీ సునీల్ కుమార్ ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా ముందస్తు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లడం ఆలిండియా సర్వీసెస్ నిబంధనలు ఉల్లఘించినట్లేనని అధికారులు చెప్తున్నారు. దీనిపై గతంలో రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా నేతృత్వంలో విచారణ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో సునీల్‌కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఆరుసార్లు విదేశాలకు
ముందస్తు అనుమతి లేకుండా పదే పదే విదేశాలకు వెళ్లటం ఆల్ ఇండియా సర్వీసెస్ (కండక్ట్) రూల్స్ ఉల్లంఘన కిందకు వస్తుందని సాధారణ పరిపాలన విభాగం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పీవీ సునీల్ కుమార్ అనుమతి లేకుండా ఇటీవల ఆరు సార్లు విదేశాలకు వెళ్లారని.. ఇవి ప్రోటోకాల్ ఉల్లంఘన కిందకు వస్తాయని అధికారులు చెప్తున్నారు. 2024 మార్చిలో సునీల్ కుమార్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు వెళ్లారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. జార్జియాకు వెళ్లేందుకు ఆయనకు అధికారిక అనుమతి ఉందని.. కానీ పీవీ సునీల్ కుమార్ నిబంధనలు ఉల్లంఘించి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్లారని పేర్కొంది. ఐపీఎస్ అధికారులు అన్ని రకాల విదేశీ పర్యటనలకు ముందస్తు అనుమతి పొందాలన్న ప్రభుత్వం... జవాబుదారీతనం, చైన్ ఆఫ్ కమాండ్ ప్రోటోకాల్‌లను పాటించాలని పేర్కొంది. పీవీ సునీల్ కుమార్ పదే పదే చేసిన ఉల్లంఘనలను క్రమశిక్షణా రాహిత్యంగా పరిగణించి, ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ కింద సస్పెండ్ చేస్తున్నట్లు స్పష్టం చేసింది.
'అక్కసుతోనే సునీల్ సస్పెన్షన్'
ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సునీల్‌ను సస్పెండ్ చేయడాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ తప్పుబట్టారు. ‘ ఎస్సీ వ్యక్తి డీజీపీ అవుతాడేమోనన్న అక్కసుతో సస్పెండ్ చేశారని అన్నారు. వ్యక్తిగత సెలవుకు అప్లై చేసినప్పుడే తాను విదేశాలకు వెళ్తున్నట్లు ఆయన చెప్పారని, కండక్ట్ రూల్‌ను అప్లై చేస్తే సగం మంది సివిల్ సర్వెంట్స్ సస్పెండవుతారని అన్నారు. ఏ మాత్రం నిజాయితీ ఉన్నా బాబు గారు తమ విదేశీ టూర్ల షెడ్యూల్స్‌ను బయటపెట్టాలని ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com