AP: జగన్ పర్యటనతో ప్రజలకు తప్పని తిప్పలు

ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్ ఎక్కడ పర్యటించినా అక్కడి ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. ఆడుదాం ఆంధ్ర ముగింపు సభ కోసం ముఖ్యమంత్రి విశాఖకు వెళ్లగా అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిపివేశారు. ఫలితంగా వాహనదారులకు చుక్కలు కనిపించాయి. బస్సులు కూడా సభకు తరలించడంతో.... ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సీఎం జగన్ విశాఖ పర్యటన స్థానికులకు తలనొప్పి తెచ్చిపెట్టింది. మధురవాడ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఆడుదాం ఆంధ్ర ఫైనల్ పోటీ కోసం సీఎం రావడంతో అధికారులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు విధిoచారు. సభ కోసం తీసుకొచ్చిన బస్సులు జాతీయ రహదారిపై పార్కింగ్ చేశారు. దీంతో ఎండాడ, మధురవాడ ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయి వాహనదారులు నానా అవస్థలు పడ్డారు.
ట్రాఫిక్ లో అంబులెన్సులు, బస్సులు చిక్కుకుపోయాయి. పోలీసులు ట్రాఫిక్ సమస్య నియంత్రించడంలో విఫలమవడంతో అంబులెన్సులు గంటల తరబడి ఇరుక్కుపోయాయి. అంబులెన్సులు ట్రాఫిక్ లో చిక్కుకుపోయినా పోలీసులు పట్టించుకోవట్లేదంటూ రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సభ కోసం ప్రజలను తరలించేందుకు అధికారులు భారీగా బస్సులు సమీకరించారు. దాదాపుగా నగరంలోని ఆర్టీసీ బస్సులన్నీ సభకే కేటాయించి డ్వాక్రా మహిళలు, పింఛన్ పొందుతున్న లబ్ధిదారులను సభకు తరలించారు. బస్సులన్నీ సభకు వెళ్లడంతో సిటీ బస్ స్టాండ్ లో విద్యార్థులు, ఉద్యోగులు, ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సీఎం పర్యటనకు తమకు ముప్పుతిప్పలు తెచ్చిపెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.. అధికారులు ఎంతో కష్టపడి ప్రజలను సభకు తరలించినప్పటికీ సీఎం రాక ముందే చాలామంది ఇంటిబాట పట్టారు..
ఆడుదాం ఆంధ్రతో క్రీడల్లో రాణించే సత్తా ఉన్న మట్టిలో మాణిక్యాలను వెలికితీశామని..... సీఎం జగన్ అన్నారు. విశాఖలో నిర్వహించిన... ఆడుదాం ఆంధ్ర ముగింపు సభలో పాల్గొన్న సీఎం..... విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ క్రీడా పోటీల ద్వారా... 37 కోట్ల విలువైన కిట్లు, 12 కోట్ల 21 లక్షల విలువైన బహుమతులు అందించామని సీఎం వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com