AP: పల్నాడులో రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు

పల్నాడు జిల్లాలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. తెలుగుదేశం శ్రేణులపై దాడులు చేస్తూ బీభత్సం సృష్టించారు. మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం రెంటాలలో తెలుగుదేశం ఏజెంట్లపై వైసీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. దాడిలో ఇద్దరు తెదేపా ఏజెంట్లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వెల్దుర్తి మండలం లోయపల్లిలో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. తెలుగుదేశం వర్గీయులను పోలింగ్ కేంద్రం నుంచి వైసీపీ నాయకులు బయటకు లాగేయడంతో ఘర్షణ జరిగింది. వైసీపీ నాయకుల దాడిలో ఇద్దరు తెలుగుదేశం కార్యకర్తలకు గాయాలయ్యాయి. గురజాల నియోజకవర్గం నడికుడిలో వైసీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. తెలుగుదేశం నేత నెల్లూరు రామకోటయ్యపై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. పెదకూరపాడు నియోజకవర్గం అచ్చంపేటలో తెలుగుదేశం వర్గీయులపై దాడికి తెగబడ్డారు. కర్రలతో దాడి చేయడంతో తెలుగుదేశం కార్యకర్త తలకు గాయమైంది. పోలింగ్ కేంద్రం వద్ద గుమికూడిన వారిని పోలీసులు చెదరగొట్టారు. ఈ ఘటనపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఇరు పార్టీలు ప్రశాంతంగా ఓటింగ్ జరిగేలా చూడాలని ఈసీ తెలిపింది. ఇక, పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరగేలా చూడాలంటూ పోలీస్ శాఖకు ఆదేశాలు ఇచ్చింది. అవసరమైతే కేంద్ర బలగాల సహాయం తీసుకోవాలని చెప్పుకొచ్చింది.

Tags

Next Story