ఇడుపులపాయ వైసీపీలో గ్రూప్‌వార్.. కర్రలు, రాళ్లతో దాడులు

కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గం, CM జగన్ సొంత ఇలాఖా అయిన ఇడుపులపాయ వైసీపీలో గ్రూప్‌వార్ భగ్గుమంది. రెండు వర్గాలకు చెందిన వారు చిన్న విషయంలో మాటామాటా పెరగడంతో కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులకు దిగారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాదాపు 8 మందికి గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. జగన్ ప్రజాసంకల్ప యాత్రకు 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చేపట్టిన కార్యక్రమంలో ఈ వివాదం తలెత్తింది. రవిరెడ్డి వర్గానికి, YS కొండారెడ్డి వర్గానికి మధ్య ఘర్షణతో స్థానికంగా వర్గపోరు బహిర్గతమైంది. అటు, ఇరువర్గాల గొడవపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇడుపులపాయలో ఎంత చిన్న రాజకీయ అంశమైనా YS కుటుంబంతో ముడిపడే ఉంటుంది. ఐతే.. నిన్నటి కార్యక్రమం విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ నేపథ్యంలో విషయం MP అనినాష్‌రెడ్డి దృష్టికి వెళ్లింది. జిల్లాలో YCPలో అంతర్గత కుమ్ములాటలు రచ్చకెక్కుతున్న ఘటనలు ఒక్కొక్కటిగా కలకలం సృష్టిస్తున్నాయి. ఇటీవలే జమ్మలమడుగులో YCP నేతల ఘర్షణలో రామసుబ్బారెడ్డి అనుచరుడు ప్రాణాలు కోల్పోవడం సంచలనంగా మారింది. అటు, కర్నూలు జిల్లా ప్రత్తికొండలోనూ ఇలాంటి గొడవే బయటపడింది. ఎమ్మెల్యే శ్రీదేవి వర్గానికి, మరో వర్గానికి మధ్య ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. ఇక ఇప్పుడు కడప జిల్లాలోని ఇడుపులపాయలోనే YCP నేతలు పరస్పరం దాడులకు దిగడం చర్చనీయాంశమైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com